మహిళా బిల్లు పేరుతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజాయితీగా తీసుకురాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్‌ను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం కుట్ర చేసిందని, దీని వెనుక రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన కూడా ఉందని ఆయన మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని తాము లోక్‌సభ సాక్షిగా అడ్డుకున్నామని, విపక్షాల ఐక్యత వల్లే మోదీ సర్కార్ ఎత్తుగడలు ఫలించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ ఓటమి మాత్రమే కాదని, బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల ఓటమి అని ఆయన వ్యాఖ్యానించారు.మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే పాసై ఉందని, చిన్నపాటి సవరణలతో వాటిని తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి విమర్శించారు. రిజర్వేషన్లను తొలగించడమే బీజేపీ అసలు ఉద్దేశమని, ఆ పార్టీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేవారని ధ్వజమెత్తారు. విపక్షాలపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని, 2023లో ప్రతిపాదించిన మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని ఆయన సూచించారు.

