భానుడి భగభగలు.. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి, సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజాంబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త కూడా చెప్పింది. ద్రోణి ప్రభావంతో గాలి దిశ మారి, రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాలకు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. అయితే, ఏప్రిల్ 28న హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి సహా మెజారిటీ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.

