NationalNewsNews Alert

రాజగోపాల్ రెడ్డి వ్యవహరంపై ఎటూ తేల్చని కాంగ్రెస్ అధిష్టానం

Share with

కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పార్టీ మారకుండా ఆయన్ను బుజ్జగించేందుకు జరిపిన చర్చలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరించాకే అంతిమంగా ఒక నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. చర్చల సారాంశంపై సోనియాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివేదిక సమర్పించాక ఆమె నిర్ణయం మేరకే తదుపరి కార్యాచరణ అమలుకానుందన్నారు.

మరోవైపు నిన్న రాత్రి ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశం మరోసారి జరిగింది. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఇందులో మునుగోడు వ్యవహారంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు.

మునుగోడు అంశంపై ఢిల్లీలో జరిగిన భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి​ అన్న కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి హాజరయ్యారు. గతంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరు కాలేదు. వెంకట్​రెడ్డి కూడా తన తమ్ముడి విషయంలో ఇంకా తానేమీ చేయలేనని చేతులెత్తేసినట్లు తెలిసింది. నిర్ణయాన్ని తన తమ్ముడు మార్చుకుంటారని అనిపించడం లేదని ఆయన అన్నట్లు సమాచారం. దాంతో ఈ పరిస్థితులను సోనియాగాంధీకి వివరించి తుది నిర్ణయం ఆమెకే వదిలేయాలని సమావేశంలో నేతలు నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. అనంతరం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ్‌ రెడ్డి లతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. మునుగోడులో రాజకీయ పరిణామాలు సహా పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించామని, 2–3 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను మీడియాకు వివరిస్తామన్నారు.