NationalNews

మువ్వన్నెల జెండా… జాతి ఆత్మగౌరవ అజెండా

Share with

జాతీయ పతాకం, ఎప్పుడు ఏ దేశంలో ప్రారంభమయ్యిందో, పతాకాల రూపకల్పన చేసిన నాటి పరిణామాల గురుంచి తెలుసుకుందాం.. పతాకంపై దేశ సమగ్రత స్ఫూర్తి ఎలా వచ్చిందన్న వివరాలు ఎంతో ఆసక్తికరం. నేడు మన జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య జన్మదినోత్సవం. అదే విధంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అజాదీకా అమృతోత్సవ వేడుకలను దేశం ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జాతీయ జెండాకు స్ఫూర్తి నింపిన విషయాలు, జెండా రూపకల్పనలో జరిగిన పరిణామ క్రమాన్ని తెలుసుకుందాం. జెండాను ఆంగ్లంలో ఫ్లాగ్ అంటారు. ఫ్లాగ్ అనే జర్మన్ పదం నుంచి దీన్ని సంగ్రహించారు. కొంత మంది చరిత్రకారులు చైనా నుంచి జెండా అనే వాడుక జరిగిందంటారు. కానీ వైదిక వాజ్మయంలో భారతదేశం వారి వారి సంస్థానాలు, రాజులు, వారి గుర్తింపుగా జెండాలను వాడినట్లు ఎన్నో ఎన్నెన్నో ఆధారాలున్నాయి.

సంస్కృతములో జెండాను “ధ్వజం” అని అంటారు. మొదటిసారిగా రామాయణంలో శ్రీ రాముడు తన రాజ్య చిహ్నంగా “సూర్యవంశ ధ్వజం” ను ఉపయోగించారు. ఇంకా అయోధ్య కాండంలోనూ దీనికి సంబంధించిన రుజువులున్నాయ్. నాడు నూతన సంవత్సర వేడుకల్లో అశ్విని పూర్ణిమ నాడు ధ్వజం ఎగురా వేశారంటారు. మహాభారతంలో అనేక ధ్వజాలను గురుంచి వర్ణన తెలియ చేయబడింది. అర్జున ధ్వజం, కాషాయ రంగు మీద హనుమంతుని రూపం, భీష్ముని జెండా మీద 5 నక్షత్రాలు తాల వృక్షము, ద్రోణాచార్య పతాకం మీద జింక చర్మం, కమండలం, భిక్ష పాత్రతో కూడి ఉంటుంది. దుర్యోధనుడు ధ్వజం సర్పంతో ఉంటుంది. అలాగే దేవీ దేవతలకు కూడా ధ్వజాలు ఉండేవి. ఋగ్వేదంలో ఇంద్ర ధ్వజోస్థాశ్వం చేసినట్లు ఆధారాలున్నాయి. మనుస్మృతిలో జెండాను అవమానిస్తే 500 పణలు పరిహారంగా చెల్లించాలని ఉండేది. ఇలా మన దేశ వాజ్మయంలో అనేక చోట్ల జెండా గురించిన ప్రస్తావనలున్నాయ్. ఇంకా ప్రతీ దేవాలయంలోనూ ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేశారంటే ధ్వజాల ప్రాముఖ్యత మన దేశంలో అనాదిగా వస్తుందని గుర్తుంచుకోవాలి.

ఇక మన జాతీయ జెండా నిర్మాణంలో వివిధ దశలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న జాతీయ జెండా త్రివర్ణ రంగులతో… మధ్యలో అశోక ధర్మ చక్రంతో రాజ్యాంగ పరిషత్ చేత జులై 22 1947 లో ఆమోదించబడింది. అసలు జాతీయోద్యమ కాలంలో మన జాతీయ జెండా వివిధ రూపాలను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో 1876 ఆగస్టు 2న జన్మించిన పింగళి.. చిన్న వయసులోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొనటానికి ఆఫ్రికా వెళ్లారు. అక్కడ గాంధీజీ ఉద్యమాలతో స్ఫూర్తిపొందారు. భారతదేశం తిరిగివచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో భారత జాతీయ పతాకం రూపకల్పన మీద ఆయనకు ఆసక్తి కలిగింది. పింగళి తన ఆలోచనలతో 1916లో ‘ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకం రాశారు. అందులో 24 రకాల జెండా నమూనాలను ప్రతిపాదించారు. హిందువులు, ముస్లింలకు చిహ్నంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఒక జెండా తయారు చేయాలని గాంధీ చెప్పారు. పింగళి అలాగే చేయగా.. అందులో చరఖా బొమ్మ చేర్చాలని హన్స్‌రాజ్ సూచించారు. అలా చేర్చిన పతాకం గాంధీజీకి బాగా నచ్చింది. ఎరుపు, ఆకుపచ్చ రంగులకు పైన.. ఇతర మతస్తులందరికీ చిహ్నంగా తెలుపు రంగును చేర్చాలని గాంధీ సూచించారు.

పింగళి జెండా భారీ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. జలియన్‌వాలా బాగ్ దురంతానికి నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో 1923 ఏప్రిల్ 13న నాగ్‌పూర్‌లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తొలిసారిగా పింగళి జెండాను ఎగురవేశారు. దీనికి బ్రిటిష్ పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ ఘర్షణ ఒక మహోద్యమంగా మారింది. మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ జెండా తరువాత బ్రిటిష్ ఇండియా జెండా ఉండేది. కానీ 1906వ సంవత్సరములో కలకత్తాలో జాతీయ జెండా నిర్మాణం జరిగింది. 1907వ సంవత్సరములో పారిస్‌లో మరో విధమైన జెండా రూపకల్పన చేశారు. 1917 సంవత్సరంలో అనిబిసెంట్, లోకమాన్య తిలక్ ఒక పతాకాన్ని రూపొందించారు. చివరగా 1921వ సంవత్సరంలో పింగళి గారు మధ్యలో చరకతో త్రివర్ణాలతో జెండా నిర్మాణం చేశారు. అసలు త్రివర్ణ రంగులలో మతాల గురించి ప్రస్తావన లేదని తెలియచేస్తూ… ఇందులోని రంగులకు మతపరమైన ప్రాతినిధ్యాలేవీ లేవని ప్రకటించారు. సాహసం, త్యాగాలకు కాషాయవర్ణం, శాంతి సత్యాలకు శ్వేతవర్ణం, నిజాయితీ, దయాగుణాలకు ఆకుపచ్చ రంగు చిహ్నాలుగా అభివర్ణించారు. దీనిని అదే సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆమోదించింది.

1947లో అశోకుడి ధర్మచక్రంతో స్వతంత్ర భారత పతాకాన్ని రూపొందించారు. స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యంగ సభ జాతీయ పతాకాన్ని రూపొందించింది. 1931 నాటి పతాకంలోని రంగులను అలాగే ఉంచి… తెలుపు రంగు మీద చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ చక్రం ముదురు నీలం రంగులో ఉంటుంది. ఇంతగా జాతీయ పతాకం నిర్మాణంలో కృషి చేసిన మన తెలుగువారు ఆంధ్రుడు ఆయన పింగళి వెంకయ్యకు చరిత్రలో సరైన గుర్తింపు ఇవ్వలేదు నాటి కాంగ్రెస్ నాయకులు. ఇంత వరకు అధికారిక వెబ్‌సైట్లో సైతం… పింగళి జాతీయ పతాక నిర్మాత అని తెలియజేయలేదు. 1921లో బెజవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సదస్సులో ‘ఒక ఆంధ్రా యువకుడు’ ఒక జెండాను తయారు చేసి గాంధీకి చూపించారు అని ప్రస్తావించారు కానీ ఆయన పేరును ఎక్కడ ప్రస్తావించలేదు. పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రదానం చేయాలని 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అదేమీ కార్యరూపం దాల్చలేదు. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… ఆయనకు సరైన గుర్తింపు ఇచ్చేలా అడుగులు వేస్తోంది. జాతీయ జెండా దేశ సమగ్రతకు దేశ సమైక్యకు నిదర్శనం.

Dr G అజ్మతుల్లా ఖాన్
మదనపల్లె