భారత్‌లో ఆర్థిక మాంద్యానికి నో ఛాన్స్ :కేంద్ర ఆర్ధిక మంత్రి
అగ్రరాజ్యం అమెరికా తాజాగా ఆర్ధిక మాంద్యంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో భారతదేశం గురించి ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ అమెరికాలో ఆర్ధిక మాంద్యం సంభవించినప్పటికీ… భారత్‌కు అలాంటి పరిస్థితి రాదని స్పష్టం చేశారు. ఎందుకంటే ఎన్నో దేశాల ఆర్ధిక వ్యవస్థలతో పోలిస్తే మన దేశ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తెలిపారు. అంతే కాకుండా అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్థ భారతదేశమేనని వెల్లడించారు. ఆహార వస్తువులపై 5% జీఎస్టీ విధించడంలో రాష్ట్రాల పాత్ర కూడా ఉందన్నారు. అయితే ఈ జీఎస్టీ ప్యాక్ చేసిన వస్తువులకు మాత్రమే వర్తిస్తుందని… విడిగా విక్రయించే వస్తువులపై ఉండదు కాబట్టి పేదలపై భారం పడదని ఆమె లోక్‌సభలో తెలిపారు. జీఎస్టీ రాకముందు తెలంగాణాలో పప్పులపై 5% ,గోధుమలపై 5%,బియ్యంపై 5% ,పిండిపై 5% ,రవ్వపై 5% ,పన్నీర్‌పై 5% పన్ను ఉండేదని,అదే పరిస్థతి ఏపీలో కూడా ఉండేదని ఆమె పెర్కొన్నారు. అందరూ అమెరికా ఆర్ధిక మాంద్యంలోకి ప్రవేశించినట్లేనని భావిస్తున్నారు. అయితే ఐఎంఎఫ్ ,ప్రపంచబ్యాంకు లాంటి సంస్థలు భారత్ వృద్ది రేటును 8.2 ,నుంచి 7.4 తగ్గించినా భారత్ మిగతా దేశాలన్నింటి కంటే వేగంగా వృద్ధి చెందుతున్నట్లు ప్రకటించాయన్నారు. అంతే కాకుండా బ్లూమ్‌బర్గ్ సర్వే కూడా భారత్ మాంద్యంలోకి ప్రవేశించే పరిస్థితులు లేవని తెలిపిందన్నారు.
దేశ ఆర్ధిక స్థితిగతులను ఆ దేశ బ్యాంకులే వెల్లడిస్తాయి. పొరుగు దేశం చైనాలో దాదాపు 4వేలకు పైగా బ్యాంకులు దివాళా తీసే స్థితిలో ఉన్నాయన్నారు. మన దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఆరేళ్ళ కనిష్ఠ స్థాయికి చేరాయన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా బాగున్నాయని చెప్పారు. మన దేశంలో ప్రభుత్వ రుణం అదుపులో ఉండటం వల్ల మనకు శ్రీలంక, పాకిస్థాన్ లాంటి పరిస్థితి రాదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. అదే విధంగా మోదీ సర్కార్ అంబానీ, అదానీల కోసం మాత్రమే పనిచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని ఆమె ఖండించారు. అంతేకాకుండా ఇతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలు కూడా ఆయా పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. అనంతరం విద్యుదుత్పత్తి సంస్థలకు తమిళనాడు రూ.20,990 కోట్లు, తెలంగాణ రూ.7,388 కోట్లు, రాజస్థాన్ రూ.5,043 కోట్లు, జార్ఖండ్ రూ.3,698 కోట్లు బకాయిలున్నారని చెప్పారు. డిస్కంలకు తెలంగాణ రూ.11,935 కోట్లు, తమిళనాడు రూ.3.677 కోట్లు, పంజాబ్ రూ.2,612 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఆమె సమాధానాన్ని విన్న కాంగ్రెస్, టీఆర్ఎస్,ఇతర ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ మధ్యలోనే వాకౌట్ చేశాయన్నారు.