అంబేద్కర్ ఆశయమే ఎస్‌ఐఆర్: రఘునందన్
సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామ శివారులోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా “ఒక వ్యక్తికి ఒకే ఓటు” ఉండేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ప్రారంభమైన ఎస్‌ఐఆర్ ప్రక్రియను బీజేపీ బీఎల్‌ఏలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఎంఐఎం పార్టీలు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ద్వారా ఓట్లు తొలగిస్తారంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగంపై అవగాహన లేమిని సూచిస్తున్నాయని విమర్శించారు.
కొంతమంది రాజకీయ నాయకులు బీఎల్‌ఏలు, బీఎల్‌వోలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, సిద్దిపేటలో కూడా అలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసిన రఘునందన్ రావు, ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రజలు క్రమం తప్పకుండా వినాలని సూచించారు.

