ఆధ్యాత్మిక పిరమిడ్ సృష్టికర్త పత్రీజి
కోట్లాది మందిని ఆధ్యాత్మికతవైపు మళ్లించిన ప్రముఖ ఆధ్యాత్మిక ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆ పరమాత్మ సన్నిధికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి సోమవారం కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పిరమిడ్ ధ్యాన్ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. పత్రీజీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుభాష్ పత్రిజీ 1947లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ బోధన్‌లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు పీవీ రమణారావు, సావిత్రీదేవిగార్లు. ఈయన కర్నూలు జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆయనకు చిన్నతనం నుండే ఆధ్యాత్మిక భావనలు మనసు నిండా ఉండేవి. ఎప్పుడూ ఒంటరిగా ధ్యానం చేస్తూండేవారు. ఆధ్యాత్మిక సాధన చేస్తూ 1980లో జ్ఞానోదయం పొందారు. తాను పొందిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇతరులకు పంచాలని భావించారు. దానితో 1990లో కర్నూల్‌లో స్పిరిచ్యువల్ సొసైటీ (పిరమిడ్ కేంద్రాన్ని) స్థాపించారు. అనేక మందిని ప్రభావితం చేసి ధ్యానులుగా, జ్ఞానులుగా మార్చారు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని ప్రజలకు పంచాలని భావించిన ఆయన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో 2008లో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణం మొదలుపెట్టారు.. 2012 నుంచి ధ్యానమహా చక్రాలు ప్రారంభించి ప్రతి సంవత్సరం లక్షలాది మందితో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకుపైగా పిరమిడ్‌లను నిర్మించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ప్రపంచంలోనే అతిపెద్దది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను స్థాపించారు సుభాష్ పత్రీజీ.

కొంతకాలంగా ఆయన మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. తాను ఆధ్యాత్మిక సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చానని శిష్యులకు చెప్తూ ఉండేవారు. తాను లేకపోయినా తాను అందించిన ఈ ఆధ్యాత్మిక ప్రచారం నిర్విరామంగా కొనసాగించాలని, తాను ఈ దేహాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైందని ముందునుంచే శిష్యులకు చెప్తూ వస్తున్నారు. గత కొన్నినెలలుగా సరిగా ఆహారాన్ని తీసుకోవడం లేదని, ఆరోగ్యం బాగా క్షీణించిందని సొసైటీ సభ్యుడు రవిశాస్త్రి తెలియజేసారు.