అప్పుల కోసం కేసీఆర్ కుస్తి… ఢిల్లీలో మంత్రాంగం…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కొత్త రాష్ట్రపతిని కలిసి శుభాకాంక్షలు చెబుతారని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ రెండు రోజులుగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి రాజకీయాలకు సంబంధించినవి కాదు…రాష్ట్ర అప్పులకు సంబంధించిన సమావేశాలు అని సమాచారం. ఇప్పటికే ఇస్తామన్న అప్పులు రాకపోవడంతో వాటిపై చర్చించేందుకు కేసీఆర్ ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఢీల్లీలో కేసీఆర్ టైమ్ పాస్ చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కానీ కేసీఆర్ ఆధికార యంత్రాంగాన్నంతా ఢిల్లికి పిలిపించుకుని వరుస సమవేశాలు నిర్వహిస్తున్నారు.

అప్పులకు అంక్షలు ఎదురవటంతో ప్రత్యామ్యాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఉదయ్ పథకం ద్వారా రూ.10200 కోట్లకు మార్గం సుగమమైంది. మరికొంత రుణం సమకూరవచ్చనే నమ్మకం అధికారుల్లో ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ భారీగా రుణాలిచ్చాయ్. ఇప్పటి వరకూ 80% రుణాలు మంజూరు చేశాయ్ . మరో 20% రావాల్సి ఉంది. ప్రాజెక్ట్ పురోగతిని బట్టి ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తవుతున్నా ఆ రుణాలు అందడం లేదు. దీనికి కారణం ఆ సంస్థలు కొత్త రూల్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన రుణానికి కేంద్రం గ్యారంటీ ఇప్పించాలని రుణ సంస్థలు పట్టుబడుతున్నాయి. అందుకే మిగిలిన రుణం పెండింగ్‌లో పడింది.

కేసీఆర్ రోజంతా ఇదే అంశమై ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఆయా సంస్థల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు ఇచ్చేందుకు… తీసుకునేందుకు జరిగిన ఒప్పందంలో ఎక్కడా కేంద్రం గ్యారంటీ అనే క్లాజే లేదని.. ఇప్పుడు కొత్తగా ఎందుకు పెడుతున్నారని కేసీఆర్ మండిపడినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో ఎన్ని చర్చలు జరిగినా..ఆయా ఫైనాన్స్ కార్పొరేషన్లు కాళేశ్వరానికి మిగతా అప్పు మంజూరు చేయాలంటే కేంద్రం గ్యారంటీ తప్పని సరి అని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం .. తెలంగాణకు ఇవ్వాల్సిన అప్పులపై పరిమితి విధించింది. ఇప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ల రుణాలపైనా ఆంక్షలు విధించడంతో తెలంగాణ సీఎంకు ఆర్థిక పరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నట్లుగా భావిస్తున్నారు. అయితే కేంద్రం వద్దకు ఈ పంచాయతీ తీసుకెళ్లలేని విధంగా రాజకీయ వైరం ఉంది. మరోవైపు అప్పులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది.