రాజీవ్ స్వగృహ ఇళ్లు మాకొద్దంటున్న కస్టమర్లు (Rajiv gruhakalpa)
తెలంగాణా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం, రాజీవ్ గృహకల్పకు లబ్దిదారులే కరువైపోయారు. ఎంత లేనివారైనా వారు నివసించే ఇళ్లు కొంచెమైనా నివాసయోగ్యంగా ఉండాలనుకుంటారు. కానీ నాణ్యత లేని గృహనిర్మాణం, డొల్లతనం, నగరానికి బహుదూరంగా ఇళ్లు, వాస్తుదోషాలు, ఏండ్ల తరబడి నిర్మాణం జరుగుతూ ఉండడం వంటి కారణాలతో ఆ ఇళ్లలో ఉండేందుకు ఎవరూ రావడం లేదు. నిర్లక్ష ధోరణిలో కాంట్రాక్టర్లు కట్టిన ఆఇళ్లు నాసిరకంగా ఉండడంతో లబ్దిదారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. లాటరీలలో వారి పేర్లు వచ్చినా ఎవరూ డబ్బు చెల్లించడం లేదు.కొన్ని ప్లాట్లు వర్షాలకు గోడలలో లీకవుతున్నాయని కూడా సమాచారం. ఇప్పటి వరకూ కనీసం 10 శాతం మంది కూడా ఇండ్లకు అడ్వాన్సులు చెల్లించలేదు. తొలి విడుతలో సుమారు లక్ష నుండి మూడు లక్షల వరకూ చెల్లించవలసి ఉండగా ఆ ఇండ్లపై ఆసక్తి చూపని ప్రజలు ఎవరూ చెల్లించడం లేదు. ఆషాడం కావడంతో డబ్బు చెల్లించడం లేదని, శ్రావణ మాసంలో కొంతమందైనా రావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజీవ్ స్వగృహ ప్లాట్లను దక్కించుకున్న వారు ఈనెల 31 లోపు ప్రభుత్వం నిర్ణయించిన ఆడ్వాన్సును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కట్టారు. ఆ వెయ్యిలోనే లాటరీలు తీసి కేటాయింపులు చేసారు. సింగిల్ బెడ్‌రూమ్ ప్లాట్లకు లక్ష, డబుల్ బెడ్‌రూమ్‌కు 2 లక్షలు, త్రిబుల్ బెడ్‌రూమ్‌లకు, డీలక్స్ ప్లాట్లకు 3 లక్షల చొప్పున అడ్వాన్స్‌ను ఈనెల 31లోగా చెల్లించాలి. లేకపోతే కేటాయింపులు రద్దు అవుతాయి. తర్వాత మిగతాసొమ్ము రెండు వాయిదాలలో చెల్లించాలి. కాగా పోచారం, బండ్లగూడాలలో 10శాతం కూడా చెల్లింపులు జరగలేదు. వారికి రీనోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈసారి కనీసం లక్ష రూపాయలు అడ్వాన్సుగా తీసుకోవాలని అనుకుంటున్నారు. దీనివల్ల నిజంగా ఆసక్తి ఉన్నవారే టెండర్లలో పాల్గొంటారని అంచనాలు వేస్తున్నారు.

అయితే ఇందులో వింత ఏమిటంటే అడ్వాన్సులు చెల్లించినవారు కూడా అక్కడ ఉండేందుకు ఇష్టపడడం లేదు. వాటిని అద్దెకు ఇవ్వాలని టు లెట్ బోర్డులు పెట్టుకుంటున్నారు. ఇంకా అడ్వాన్సులు ఇవ్వనివారు ఆఇళ్లు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు. ఇక పోచారం దగ్గర రాజీవ్ గృహకల్పలో ఉండేవారి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వారి ఇళ్లు వానలకు తడిసి, గోడలలోంచి నీరు లీకయ్యి కరెంటు షాక్‌లకు గురిఅవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎక్కువ అంతస్తుల ఇళ్లు, లిఫ్ట్ లేకపోవడం కూడా వృద్దులకు, వికలాంగలకు కష్టంగా మారింది. మొత్తానికి ఈరాజీవ్ గృహకల్ప ఇళ్లు అంత నివాసయోగ్యంగా లేవని, అందుకే వాటికి డిమాండ్ ఉండడం లేదని ప్రజల అభిప్రాయం.