Andhra PradeshNews

జగన్ ప్లానింగ్.. ఎమ్మెల్యేలు బెదుర్స్

Share with

◆ వైసీపీలో మొదలైన అభ్యర్థులు ఎంపిక
◆ ప్రతి నియోజకవర్గంపై దృష్టి పెట్టిన జగన్
◆ సర్వేలతోపాటు కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం
◆ ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు
◆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠతో పాటు టెన్షన్ పెరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ పరిపాలనతో పాటు పార్టీ ప్రక్షాళన పై పూర్తిగా దృష్టి సారించి ఈ నెల నాలుగో తేదీ నుండి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి 50 మంది వైసీపీ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్. కార్యకర్తలకు ఇన్నాళ్లుగా అందుబాటులో లేని ఎమ్మెల్యేలకైతే చెమటలు పడుతున్నాయ్. ఈసారి ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఉంటాయని జగన్ ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే వారిని ఎంపిక చేస్తామని పదేపదే అంటున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయటంతో కొంతమంది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్‌లో అనేక ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. టికెట్ రాని పక్షంలో ఏ పార్టీలో చేరాలో కూడా ఇప్పటి నుండే కొంతమంది తమతమ అనుచరులతో కసరత్తులు జరుపుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఎంపిక చేసి మరి తాడేపల్లికి తరలిస్తున్న నేపథ్యంలో పార్టీ పట్ల నియోజకవర్గం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో సరైన సమాచారం కార్యకర్తలు జగన్ దృష్టికి తీసుకువస్తున్నారు. ఇలా ఏపీలో అన్ని నియోజకవర్గాల పరిస్థితి మొత్తం కొన్ని నెలల్లోనే కార్యకర్తల ద్వారా జగన్‌కు చేరనుంది. దీంతో పార్టీని ఏ విధంగా ప్రక్షాళన చేసి 175 కి 175 నియోజకవర్గాలు గెలవాలో జగన్ వ్యూహాలు రచించనున్నారు.

ఇప్పటికే కుప్పం, రాజాం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన జగన్ ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఇలా వరుసగా కొన్ని నెలల్లోనే ఒక్కో నియోజకవర్గానికి అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తారని కార్యకర్తలు అంటున్నారు. ముందుగా ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థులను ఖరారు చేయడం వలన కూడా ప్రచారానికి అలానే నియోజకవర్గంలో పూర్తిపట్టు ఆ అభ్యర్థికి వస్తుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్న జగన్ కార్యకర్తలతో సమావేశాలు ఆయా నియోజకవర్గాల పూర్తి పరిస్థితులు తెలుసుకోనున్నారు. ప్రతి ఎమ్మెల్యే జాతకం తెలుసుకుంటున్న జగన్ ఈసారి ఎన్నికలకు ఎంతమందిని మారుస్తారు… ఎంతమందిని ఉంచుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

దీంతో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి కదలని ఎమ్మెల్యేల్లో చలనం వచ్చి ప్రతి ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమం చాలా పకడ్బందీగా తిరుగుతున్నారు. మూడు సంవత్సరాలుగా ఇంట్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా వైయస్ జగన్ వైసీపీ ప్లీనరీ అనంతరం తన వ్యూహాలకు మరింత పదును పెట్టి ఎమ్మెల్యేలను పరిగెత్తిస్తున్నారు. ఏపీలో మరో మారు గెలుపే దిశగా ఆయన వ్యూహాలు ఫలించి అనుకున్న లక్ష్యం సాధిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.