InternationalNews Alert

నిన్న శ్రీలంక నేడు బంగ్లాదేశ్ -భగ్గుమన్న ఇంధన ధరలు

Share with

భారతదేశానికి పొరుగు రాజ్యాలు ఒక్కొక్కటిగా ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నేడు బంగ్లాదేశ్ కూడా శ్రీలంక బాటనే పట్టింది. హఠాత్తుగా అక్కడ పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. 52 శాతం మేరకు పెరిగాయి. ఆదేశంలో ఇంతగా ధరలు పెరగడం మొదటిసారని అక్కడి మీడియా వర్గాలు మొత్తుకుంటున్నాయి. మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా సంక్షోభంతో ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న, ఇంకా ఆర్థకంగా స్థిరత్వం సాధించని ఆసియా దేశాలపై కోలుకోలేని దెబ్బ పడింది. దానికి తోడు ఆయా దేశాల రాజకీయ అస్థిరత్వం కూడా తోడై ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ కూడా నేడు ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొంతకాలంగా జరుగుతున్న రష్యా -ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఇంధన, ఆహారధరలు పెరగడం వాటిని దిగుమతి చేసుకొనేందుకు అధిక మొత్తం వెచ్చించాల్సి రావడం వల్ల ప్రతీదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాలు పడ్డాయి.

బంగ్లాదేశ్‌లో తాజాగా పెట్రోల్ ధర ఒకేసారి 51.2 శాతం పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ కరెన్సీ ప్రకారం దాదాపు 44 టాకాలుపెరిగి లీటరు ధర 130 టాకాలకు చేరుకుంది. డీజిల్‌పై 34 టాకాలు,ఆక్టేన్‌పై 46 టాకాలు పెరిగింది. కిరోసిన్‌పై కూడా 42 శాతం పెరిగింది. ఇలా ఒకేసారు పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. బస్సు చార్జీలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఆందోళనలు మొదలు పెట్టారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లోనే పెంచాల్సి వచ్చినట్లు సంజాయిషీ ఇచ్చుకుంది. ఇంధన ధరలు పెరగడంతో బంగ్లాదేశ్ పరిస్థితి దిగజారుతోంది. దీనితో ఋణాలకోసం బంగ్లాదేశ్ ప్రక్కదేశాలవైపు చూడడం,  ఇంకా IMF మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల సహాయం కోసం ఎదురుచూస్తోంది. భారత్‌లో కూడా పెట్రోల్, గ్యాస్ ధరలు, నూనెలు, నిత్వావసరాల ధరలు ఈమధ్యకాలంలో బాగా పెరిగి ప్రజలు భరించలేని పరిస్థితులకు చేరుకుంటున్నారు. ప్రభుత్వాలు పనికిరాని సంక్షేమ పథకాల జోలికి పోకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.