‘సర్’ ప్రక్రియ రక్తపాత రహిత రాజకీయ నరమేధం
దేశవ్యాప్తంగా 16.5 కోట్ల మంది ఓట్లు గాల్లోకి ?
సాధారణ, పేద వర్గాలపైనే తీవ్ర ప్రభావం
సమీక్షించని ఎన్నికల సంఘం.. వీధి పోరాటాలే శరణ్యం!
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (SIR) ప్రక్రియ అనేది ఒక రక్తపాత రహిత రాజకీయ నరమేధమని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అభివర్ణించారు. విశాలాంధ్ర దినపత్రిక 74వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ గాంధీనగర్లో ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ఆంతర్యం–సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఇప్పటివరకు పాలకులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ ‘సర్’ ప్రక్రియ ద్వారా ఎవరు ఓటర్లుగా ఉండాలనేది పాలకులే నిర్ణయించే దారుణ పరిస్థితి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ ప్రక్రియను పూర్తి చేసి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారని డాక్టర్ పరకాల ప్రభాకర్ వెల్లడించారు. ఇదే వేగంతో దేశమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మొత్తం 16.5 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. ‘సర్’ అనేది కేవలం ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమం అని పైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ, దీని వెనుక కొన్ని వర్గాల ఓట్లను తొలగించాలనే రహస్య అజెండా దాగి ఉందని ఆరోపించారు.గతంలో (2002లో) నిర్వహించిన ‘సర్’ ప్రక్రియలో ఓటర్లు తమ అర్హతలను నిరూపించుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం రాలేదని, కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం కచ్చితంగా డాక్యుమెంట్లు సమర్పించాలని బలవంతం చేస్తున్నారని పరకాల పేర్కొన్నారు. దీనివల్ల కనీస పరిజ్ఞానం,ఆధారాలు లేని దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు, రోజువారీ కూలీలు భారీగా ఓట్లు కోల్పోతున్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు. తెలంగాణలోనూ దాదాపు 88 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ జరగలేదని ప్రకటించారని, అంటే అక్కడ కూడా ఆ ఓట్లలో అత్యధికం తొలగించే అవకాశం ఉందన్నారు. బిహార్లో ‘సర్’ ప్రక్రియ తర్వాత 63 లక్షల మంది ఓట్లు తొలగించడంతో పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగినా, ఎన్నికల సంఘం కనీసం సమీక్ష కూడా చేయకుండా ముందుకు వెళుతోందని పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. ఈ ప్రక్రియ వల్ల దేశంలో ‘ఓటు హక్కు ఉన్నవారు’, ‘ఓటు హక్కు లేనివారు’గా పౌరుల మధ్య విభజన వస్తుందని, నియోజకవర్గాల పునర్విభజన కూడా అత్యంత దారుణంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమంగా, మన ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వీధి పోరాటాలు ఒక్కటే శరణ్యమని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలను చైతన్యపరుస్తాం:
సీపీఐ నేతలు విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్లు మాట్లాడుతూ.. ‘సర్’ ప్రక్రియలోని లోపాలపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించి ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతులను చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

