వెట్టిచాకిరి సుంకాలను వ్యతిరేకించిన భారత్
వెట్టిచాకిరి కార్మికులతో తయారైన వస్తువులపై అదనపు దిగుమతి సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నిర్వహించిన బహిరంగ విచారణలో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ మిశ్రా ఈ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీని అరికట్టడమే లక్ష్యమని చెబుతున్న అమెరికా, తనకు అవసరమైన సుమారు 1,600 ఉత్పత్తులకు మాత్రం మినహాయింపులు ఇవ్వడం అస్థిరమైన, పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇలాంటి మినహాయింపులు విధాన లక్ష్యాన్నే బలహీనపరుస్తాయని పేర్కొన్నారు.
సెక్షన్ 301 కింద దర్యాప్తులు, సుంకాల కంటే పరస్పర చర్చల ద్వారానే వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మిశ్రా తెలిపారు. అలాగే 60 దేశాలపై ఒకే విధమైన నిబంధనలు అమలు చేయడం సరికాదని, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తుల్లో బలవంతపు శ్రమ వినియోగానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
అమెరికా ప్రతిపాదించిన 10 నుంచి 12.5 శాతం అదనపు సుంకాలపై భారత పరిశ్రమల సంఘాలు ఫిక్కీ, సీఐఐ కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సుంకాల వల్ల భారత ఎగుమతిదారులతో పాటు అమెరికా తయారీ సంస్థలు, రిటైలర్లు, వినియోగదారులపై కూడా భారం పడుతుందని పేర్కొన్నాయి.
అయితే అంతర్జాతీయ కార్మిక మార్కెట్లో అసమాన పోటీని అరికట్టడానికే భారత్ సహా 60 దేశాలపై ఈ సుంకాలు ప్రతిపాదించినట్లు యూఎస్టీఆర్ అంబాసిడర్ జెమీసన్ గ్రీర్ తెలిపారు. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

