Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

బ్రిక్స్ కార్మిక సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం

హైదరాబాద్‌లో జులై 14 నుంచి 16 వరకు బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 14 బ్రిక్స్ దేశాల నుంచి సుమారు 50 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 70 మంది భారతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ సంఘటనా కార్యదర్శి బి. సురేంద్రన్ కీలక అంశాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పురోగతి కార్మిక మార్కెట్‌ను వేగంగా మారుస్తోందని, అయితే దాని ప్రభావం ఆయా దేశాల జనాభా, ఆర్థిక విధానాలు, సామాజిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమ్మిళిత కార్మిక మార్కెట్, న్యాయమైన పరివర్తన, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం బ్రిక్స్ దేశాలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

అసంఘటిత రంగ కార్మికులు, మహిళల శ్రామిక భాగస్వామ్యం, నిరుద్యోగం, వలస కార్మికుల సంక్షేమం వంటి అంశాలు ఇప్పటికీ ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. పెరుగుతున్న డిజిటల్, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఉపాధి నేపథ్యంలో ప్రతి కార్మికుడికి సార్వత్రిక సామాజిక భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు.

మహిళల ఉపాధి అవకాశాలను పెంచేందుకు లింగ సమానత్వ విధానాలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత, సాంకేతిక శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ రంగం, కృత్రిమ మేధ (ఏఐ), ఉన్నత సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం స్థిరమైన ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఏఐ, ఆటోమేషన్, డిజిటలైజేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ, ఉపాధి భద్రత, డిజిటల్ అంతరం, కార్యాలయాల్లో నిఘా, కార్మిక హక్కుల పరిరక్షణ వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత మానవ గౌరవం, కార్మిక హక్కులు, సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉపయోగపడేలా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

భవిష్యత్ కార్మిక మార్కెట్‌కు అనుగుణంగా నిరంతర నైపుణ్యాభివృద్ధి, పునఃనైపుణ్య శిక్షణ (Reskilling), ఉన్నత నైపుణ్యాల (Upskilling)పై పెట్టుబడులు పెంచాలని సూచించారు. ఈ ప్రక్రియలో ట్రేడ్ యూనియన్లు కార్మికుల హక్కులను కాపాడటంతో పాటు సామాజిక సంభాషణలకు వేదికగా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

సమావేశాల్లో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించనున్నారు. అవి.. సార్వత్రిక సామాజిక భద్రత, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక భద్రత పోర్టబిలిటీ, కార్యాలయాల్లో మానవ కేంద్రీకృత ఏఐ వినియోగం, బాధ్యతాయుతమైన పాలన, నైపుణ్యాల కొరతను అధిగమించడంలో ట్రేడ్ యూనియన్ల పాత్ర, అలాగే మహిళలు– భవిష్యత్ ఉపాధి అవకాశాలపై సమ్మిళిత విధానాలు.

ఈ సమావేశాల ద్వారా కార్మిక హక్కుల పరిరక్షణ, సాంకేతిక పరివర్తనకు అనుగుణమైన విధానాలు, మహిళల భాగస్వామ్యం, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై బ్రిక్స్ దేశాల మధ్య ఉమ్మడి కార్యాచరణకు మార్గం సుగమం అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.