ఆయనో స్పూర్తి కేతనం.. తెలంగాణకు ఎంతో ఆదర్శం
- అదో ఉద్యమ స్వరం
- పక్షపాత విధానాలపై ఎలుగెత్తిన గళం
- నిరంకుశ విధానాలను ఎదురొడ్డిన వైనం
- ఉద్యమ కారులకు ఆయనో ఆత్మ విశ్వాసం. అమేయ మేధో పాటవం.. ఓ చైతన్య కేతనం.
ఎన్నో దశాబ్దాల పాటు వినిపించిన ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు ఆయన ఓ గుండె చప్పుడు. ఎన్నో మెదళ్ళను కదిలించి, పోరు బాట పట్టించిన ఆ యోధుడే ఆచార్య కొత్తపల్లి జయంశంకర్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనిచ్చిన స్పూర్తిని, ధైర్యాన్ని, పోరాడే తెగువను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయనది చెరగని స్ధానం. ఆయన పేరు నిత్యం ప్రాత:స్మరణీయం. ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించిన జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. తల్లి దండ్రులు మహలక్ష్మీ, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించిన ఆయన ఆజన్మాంతం అవివాహితునిగానే ఉన్నారు. బహు బాషా కోవిదునిగా అమేయ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన ఆయా భాషల్లో అనర్గళంగా ప్రసంగించి ఎంతో మంది ప్రభావితం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డీ పట్టా సాధించారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్ లోని సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్‌గా.. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్ గా వ్యవహరించారు. 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి గా పనిచేశారు. తెలంగాణ సాధనపై ఎన్నో కలలు కన్న ఆయన .. ఆ కల సాకరం కాక మునుపే 2011 జూన్ 21న కన్నుమూశారు.
1952 లో నాన్ ముల్కీ ఉద్యమం,సాంబర్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకించి మొదటి ఎస్ఆర్‌సీ కమీషన్ ముందు హజరై తెలంగాణ వాణిని గట్టిగా వినిపించారు. తెలంగాణ డిమాండ్ ను 1969 నుండి సునిశితంగా అధ్యయనం చేయడంతో పాటు విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అవశ్యకతపై పలు పుస్తకాలు రాశారు. అధ్యాపకుడిగా అయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృతి పట్ల నిబద్దత ఎంతగా ఉండేదో.. అలాగే ప్రవృత్తి పట్ల కూడా నిబద్ధతతోనే వ్యవహరించే వారు.
విద్యార్ధి దశ నుంచే తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం, అసమానతల పట్ల తీవ్రంగా గళమెత్తారు. పోరు బాట పట్టారు. చిన్నతనం నుంచే తెలంగాణ భాష, సంస్కృతి, ఆచారాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడం వల్ల ఆంధ్రా నాయకుల వివక్షను పసిగట్టి వారి నైజాన్ని ఎత్తి చూపారు. తెలంగాణ పట్ల ఎలాంటి చిన్న చూపు చూసినా ఊరుకునేవారు కాదు. వారికి సరైన రీతిలో సమాధానం చెప్పేవారు. సామాన్య కుటుంబంలో జన్మించి యావత్తు తెలంగాణ సమాజం గుర్తుంచుకోదగ్గ వ్యక్తిగా ఎదిగిన ఆచార్య జయశంకర్ ఈ తరానికే కాదు.. ఎన్ని తరాలకైనా ఆదర్శపురుషుడే. తెలంగాణ గడ్డ ఉన్నంత వరకూ ఆయన త్యాగం అందరికీ గుర్తుండి పోతుంది. ఆయన స్పూర్తి అందరి గుండెల్లో నిలిచే ఉంటుంది. ఆయనను మనసారా స్మరించుకోవడమే ఆ మహనీయునికి మనమిచ్చే ఘన నివాళి.