లీటరుకు 35 కి.మీ.. మారుతీ హైబ్రిడ్ సంచలనం!
భారత ఆటోమొబైల్ రంగంలో మైలేజ్ కింగ్ గా పేరున్న మారుతీ సుజుకి, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా సరికొత్త విప్లవానికి తెరలేపింది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 20 లక్షల పైబడిన ధరకు మాత్రమే లభిస్తున్న ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’ టెక్నాలజీని, సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటి వరకు టొయోటా కంపెనీ సహకారంతో హైబ్రిడ్ కార్లను విక్రయిస్తున్న మారుతీ, ఇకపై తన సొంత ‘సిరీస్ హైబ్రిడ్’ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ నేరుగా చక్రాలను తిప్పదు. అది కేవలం ఒక ‘జనరేటర్’ వలె పనిచేస్తూ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఆ బ్యాటరీ శక్తితో ఎలక్ట్రిక్ మోటార్ రన్ అయ్యి కారును ముందుకు నడిపిస్తుంది. ఈ టెక్నాలజీతో మారుతీ తన పాపులర్ మోడల్ బాలెనోనలో లీటరుకు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ కార్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అయితే మారుతీ తీసుకురాబోయే ఈ కొత్త సిస్టమ్ వల్ల తక్కువ తయారీ ఖర్చు అవుతుంది. సాధారణ పెట్రోల్ కారు ధర కంటే సుమారు రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల అదనపు ధరకే హైబ్రిడ్ వెర్షన్ లభించే అవకాశం ఉంది. “భారతీయ రోడ్ల పరిస్థితులకు, వినియోగదారుల బడ్జెట్‌కు అనుగుణంగా అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన కార్లను అందించడమే మా లక్ష్యం.” అని మారుతీ సుజుకి తెలియజేసింది. త్వరలోనే ఈ టెక్నాలజీతో కూడిన ఫ్రాంక్స్, బాలెనో, స్విఫ్ట్ కార్లు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే!

