BusinessHome Page SliderNationalNewsNews Alert

క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఊరట

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మేలు చేకూర్చేలా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక సవరణలు చేపట్టింది. ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో భాగంగా ఆలస్యపు చెల్లింపులు, జరిమానాల విషయంలో పారదర్శకతను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్ణీత గడువు తేదీ ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా ప్రకటించకూడదు. గడువు తర్వాత అదనంగా 3 రోజుల సమయం ఇవ్వాలి. ఈ లోపు చెల్లింపు చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. గతంలో బ్యాంకులు మొత్తం బిల్లుపై పెనాల్టీ విధించేవి. ఇకపై, గడువు తర్వాత మిగిలి ఉన్న నికర బకాయి మొత్తంపై మాత్రమే జరిమానా లెక్కించాలి. పొరపాటున ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యమైనా, భారీ జరిమానాలు పడకుండా, సిబిల్ (CIBIL) స్కోర్ దెబ్బతినకుండా ఈ నిబంధనలు వినియోగదారులకు ‘సేఫ్టీ నెట్’లా పనిచేస్తాయి. జరిమానా విధించడానికి 3 రోజుల వెసులుబాటు ఉన్నప్పటికీ, వడ్డీ ఆలస్యమైన రోజుల లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుంది. వడ్డీ రేట్లు, బిల్లింగ్ సైకిల్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. వివిధ బ్యాంకులు తమకు నచ్చినట్లుగా జరిమానాలు విధించకుండా, దేశవ్యాప్తంగా ఒకే విధమైన పారదర్శక విధానాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా సమయానికి చెల్లింపులు చేయడమే శ్రేయస్కరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.