ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకున్న.. గవర్నర్ తమిళిసై
తెలంగాణాలో ప్రతి ఏటా ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను ఎంతో సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది బోనాలను సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రగవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మహాకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణాలో జరిగే బోనాలకు చాలా గొప్ప చరిత్ర ఉందన్నారు. అయితే ఈ సారి జరిగే బోనాలకు చాలా ప్రత్యేకత ఉందన్నారు.

అమ్మవారి దయవల్ల క్రమంగా అడ్డంకులన్నీ తొలగుతున్నాయన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కరోనా మహమ్మారి తగ్గు ముఖం పట్టడంతో ప్రజలంతా చాలా సంతోషంగా .. మునుపటి తరహాలో సాధారణ జీవితం గడుపుతున్నారని గవర్నర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్,బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించారు.