NewsTelangana

లక్ష కోట్ల కాళేశ్వరం వరద పాలు

Share with

తెలంగాణా ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిజస్వరూపం గోదారమ్మ బయటపెట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదంతో ఎన్నికలలో డప్పువాయించి అత్యంత భారీగా అంతర్జాతీయ స్థాయి బహుళార్థసాధక ప్రాజెక్ట్ అంటూ  చెప్పిన కేసీఆర్  కల్లబొల్లిమాటలు తేటతెల్లమయ్యాయి.  గతవారం తెలంగాణాను అతలాకుతలం చేసిన తుఫాన్లు, వరదల కారణంగా ఆనకట్టలన్నీపొంగి ప్రవహించాయి. దీనితో  గోదావరి నది ఉప్పొంగి 28 లక్షల క్యూసెక్కులు నీరు రావడంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి వరద నీరు చేరింది. పంప్‌హౌస్‌ గేట్లు పగిలిపోయి నీరు లోపలికి వచ్చింది. దీంతో పంప్‌హౌస్‌లో ఉన్న 17 మోటర్లు, కంప్యూటర్లు తదితర సామగ్రి నీటిలో మునిగిపోయాయి. రక్షణగోడ కూడా కూలిపోయింది. దీనికి కారణం నాణ్యత లేకపోవడమేనని నిపుణుల భావిస్తున్నారు. గోడ కూలడం వల్ల గేట్లు ఊడిపోయాయి.

మోటర్లపై పడితే మోటర్లు భారీగా దెబ్బతినే అవకాశముంది. ఎందుకంటే అక్కడే ఉన్న 180 టన్నుల బరువుకల హైడ్రాలిక్ క్రేన్ కూడా  మోటర్లపై పడి ఉంటుంది.17 మోటర్లలో ఏ ఒకటి దెబ్బ తిన్నా కొన్ని వందలకోట్లు నష్టం జరుగుతుంది. ఇంకా పంపుహౌస్‌లోకి దిగే 3 లిప్టులు, కూలీలు వాడే లిప్టులు కూడా పాడయివుండొచ్చని చెప్తున్నారు. ఈనష్టాన్ని అంచనా వేసేందుకు ఆపరేషన్ కాళేశ్వరం కార్యక్రమం చేస్తున్నారు. పంపుహౌసు  200 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పుతో 120 మీటర్ల లోతులో ఉంది. 17 మోటర్లు 40 కిలోవాట్ల సామర్థ్యంతో ఉన్నవి నీటమునిగాయి. 2,3 రోజుల్లో నీటిని తోడడానికి భారీ జనరేటర్లను తెచ్చారు. నీటిని తోడి చూసి, మోటర్లు దెబ్బతింటే విదేశాలనుండి ఇంజనీర్లను రప్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా నష్టం అంచనా వేసాకే కేసీఆర్ కాళేశ్వరానికి వచ్చే అవకాశాలున్నాయి.

ములుగు వరకూ ఏరియల్ సర్వే చేసిన కేసీఆర్ కాళేశ్వరానికి రాకుండానే వెనక్కివెళ్లారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఆధునికీకరణకు నిపుణుల బృందం పరిశీలించింది. వీరి నివేదికలు ఆధారంగా తదువరి చర్యలు చేపడతారు. మరోపక్క అన్నారంలోని సరస్వతి పంపుహౌస్‌లో కూడా 12 మోటర్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గత 3 రోజులుగా నీటిని తోడుతున్నారు. ఇప్పటివరకు 10 మీటర్ల లోతు వరకు నీటిని తోడారు. ఇంకా 13 మీటర్లు తోడాల్సిఉంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేలకోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కుటుంబం చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు రూ.2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని,  రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేసిన దళితులు, అణగారిన వారి జీవితాలేమీ మారలేదని, కేసీఆర్‌ కుటుంబం మాత్రం బాగుపడిందని  దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అంచనాకు మించి వేలకోట్లు వ్యయం చేసారని, ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అయ్యిందో.. అణాపైసా లెక్కలతో సహా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల చేతుల్లో నుండి ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వేలకోట్లు చేరాయని రేవంత్ ఘాటుగా విమర్శలు చేసారు.