Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం

అమరావతి: సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హననం, సైబర్ వేధింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వంపై, రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై మరిన్ని కేసులు నమోదు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా దుర్వినియోగం, నమోదైన కేసులు, సైబర్ నేరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దుష్ప్రచారాలపై చర్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్న ఉన్నతస్థాయి మంత్రుల కమిటీ (జీవోఎం)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించాలని సీఎం సూచించారు.

కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, సోషల్ మీడియా సమాజానికి పెద్ద సమస్యగా మారిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, మహిళలు, కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ, అనుచిత, ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను వేగంగా గుర్తించి చర్యలు తీసుకునేందుకు రాష్ట్రస్థాయి రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సోషల్ మీడియా దుర్వినియోగం, వేధింపుల కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, సోషల్ మీడియాను అసత్య ప్రచారం కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.