Home Page Sliderhome page sliderTelangana

అన్నదాతలరా అధైర్యపడొద్దు …అండగా నేనుంటా

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన పంట నష్టంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ , వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన, క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించాలని, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.సిద్దిపేట అర్బన్ మండలంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న , మామిడి తోటలు భారీగా దెబ్బతిన్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదుసార్లు వడగండ్ల వానలు, ఒకసారి తుఫాన్ రావడంతో రైతులు కుదేలయ్యారని గుర్తు చేశారు. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో ముగ్గురు మంత్రులు కలిసి సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించినా, నేటికీ ఏ ఒక్క రైతుకు రూపాయి సాయం అందలేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా, రైతులకు వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకున్న తీరును గుర్తు చేస్తూ, ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు.కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోయిందని, ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీ సమస్యల పరిష్కారం కోసం తాను పోరాడుతానని స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులు త్వరితగతిన అంచనాలు పూర్తి చేసి రైతులకు భరోసా కల్పించాలని హరీశ్ రావు సూచించారు.