NewsNews AlertTelangana

ఈడీ దెబ్బతో..చీకోటి బాగోతం బట్టబయలు

Share with

ఈ మధ్యకాలంలో క్యాసీనో గురించిన కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో మొదటి నుంచి  ప్రధాన నిందితుడిగా ఉన్న చికోటి ప్రవీణ్‌ విదేశీ క్యాసినో దందాలో హవాలా లావా దేవీల గుట్టు తేలేటట్టు కన్పిస్తుంది. పొరుగు దేశాలలో క్యాసినోల నిర్వాహణలో అనుభవం గడించిన చీకోటి ప్రవీణ్ బృందం చీకటి బాగోతం బహిర్గతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఈ రోజు ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరెట్ (ఈడీ) విచారించనుండటం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ చీకోటి ప్రవీణ్ బృందం నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయ్‌లాండ్.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఒక్కో విడత మూడు నాలుగు రోజులపాటు జరిగే ఈ క్యాసినో క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు రూ.3-5 లక్షల చొప్పున ప్రవీణ్ బృందానికి చెల్లించినట్లు ఈడీ గుర్తించింది.

ఈ క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిపించారని చికోటి బృందంపై ప్రధానంగా ఆరోపణ ఉంది. ఈ విధంగా క్యాసినో హవాలా దందాలు నిర్వహిస్తూ..వాటితో వచ్చే కమిషన్లతో ప్రవీణ్ డబ్బులు సంపాదించి భారీగా ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తుంది. అయితే ఇప్పటికే ప్రవీణ్‌తో పాటు అతడి అనుచరుడు దాసరి మాధవరెడ్డి బ్యాంకు లావాదేవీల గురించి  ఈడీ ఆరా తీసింది. అంతే కాకుండా వారి పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను కూడా ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మరోవైపు చీకోటి తన జన్మదిన వేడుకలు.. బోనాలు,వినాయక చవితి పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున చేసిన ఖర్చును కూడా లెక్కగడుతుంది. ఈడీ వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా చీకోటి ప్రవీణ్‌ను ఈ రోజు విచారించనున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డితో పాటు నగరంలోని మరికొందరు హవాలా ఏంజెట్ల ద్వారా వచ్చే సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తులో ముందుకుకెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చీకోటి హవాలా లావాదేవీల్లో రాజకీయ,సినీ ప్రముఖుల పాత్ర ఎంత వుంది? అనే విషయం ప్రస్తుతం  హాట్ టాపిక్‌గా మారింది.