బ్యాంకులకు సీపీ సజ్జనర్ వార్నింగ్
బ్యాంకులు ఖాతాల ఓపెనింగ్ లక్ష్యాలకే పరిమితం కాకుండా కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. ఒక్క కస్టమర్ కూడా సైబర్ నేరాలకు బలికాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో గురువారం మ్యూల్ ఖాతాల నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకులు ‘సేఫ్ కస్టమర్ చాలెంజ్’ను స్వీకరించాలని సూచించారు. ప్రతి బ్యాంకు శాఖ ‘జీరో మ్యూల్ అకౌంట్స్’ లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా బ్యాంకుల పనితీరును అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు

