జనగణనలో తొలిసారి కులగణన
ప్రజాస్వామ్య దేశంలో జనాభా లెక్కల సేకరణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభివర్ణించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన తన వివరాలను స్వీయ ధ్రువీకరణ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో తొలిసారిగా జనగణనతో పాటే కులగణన కూడా జరుగుతోందని వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారనే అపోహలు నమ్మవద్దని, ప్రజలందరూ నిర్భయంగా వాస్తవ సమాచారాన్ని అందించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియను మంత్రి అభినందించారు. దీనివల్ల నకిలీ ఓట్లను సమర్థవంతంగా తొలగించే అవకాశం ఉంటుందని, తద్వారా నిజమైన ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పోలింగ్ శాతం 50 శాతానికి మించడం లేదని, ఈ కొత్త విధానంతో నగరాల్లోనూ భారీగా పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. అక్రమ ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్లు కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పూర్తి చేసిన పలు రైల్వే ప్రాజెక్టులను, జాతీయ రహదారులను ప్రధాని జాతికి అంకితం చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రానికి పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

