Andhra Pradeshhome page sliderHome Page Slider

పార్టీ బలోపేతంపై నాగబాబు ప్రత్యేక దృష్టి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతంపై ఎమ్మెల్సీ నాగబాబు ప్రత్యేక దృష్టి సారించారు. పిఠాపురంలో జనసేన నేతలు, కార్యకర్తలతో ఆయన ‘మాటామంతి’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యకర్తలతో ముఖాముఖి చర్చించి, వారికి దిశానిర్దేశం చేశారు.

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కార్యకర్తల శ్రమ వెలకట్టలేనిదని నాగబాబు కొనియాడారు. “మీ కష్టమే పార్టీకి బలం. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది,” అని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నియోజకవర్గంలో ఇటీవల సంచలనం సృష్టించిన టీడీపీ నేత వర్మ వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, నాగబాబు దానిపై స్పందించేందుకు నిరాకరించారు. ఆ విషయంలో మౌనాన్ని ఆశ్రయించిన ఆయన, ఇది కేవలం పార్టీ అంతర్గత బలోపేతం , కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమని స్పష్టం చేశారు. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా కేవలం అభివృద్ధి, పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ ఆయన వ్యవహరించిన తీరు జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాగబాబు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కార్యకర్తలు ఇచ్చిన సూచనలను నోట్ చేసుకున్న ఆయన, వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ప్రతి గడపకూ జనసేన భావజాలాన్ని చేరవేయాలని ఆయన సూచించారు.