బిల్ గేట్స్‌నే వెనక్కి నెట్టి అదానీ జోరు !
ప్రపంచ మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. గతంలో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజాలను వెనక్కి నెట్టి అదానీ దూసుకుపోతున్నారు. ఇటీవలే భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీని అధిగమించిన అదానీ..తాజాగా బిల్ గేట్స్‌ను కూడా వెనక్కి నెట్టారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ కూడా ఆయన నికర సంపద భారీగా పెరగడం విశేషం. తాజా పెరుగుదలతో అదానీ మళ్లీ 100 డాలర్ల బిలియన్ల క్లబ్‌లోకి చేరడమే కాకుండా, ప్రపంచ ధనవంతుల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అదానీ సంపదలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. గౌతమ్ అదానీ నికర సంపద కేవలం ఒక్క రోజులోనే 7.16 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 60,000 కోట్లు) పెరిగింది. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తి విలువ 106 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో అదానీ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 17వ స్థానానికి చేరారు. ప్రస్తుతం 104 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న బిల్ గేట్స్‌ను అదానీ ($106 బిలియన్లు) క్రాస్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఈ జాబితాలో టాప్-20లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 90.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో 20వ స్థానంలో ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వరుసగా లాభాల్లో పయనిస్తుండటంతో, అదానీ సంపద మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

