సరికొత్త హామీలతో ఆకర్షణీయంగా ‘బీఆర్‌ఎస్ మేనిఫెస్టో’
2023 తెలంగాణ ఎన్నికలకు పూర్తిస్థాయిలో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా సిద్దమవుతోంది బీఆర్‌ఎస్ పార్టీ. మహిళలు, రైతులను ఆకట్టుకునేలా ప్రత్యేక పథకాలతో ఈ మేనిఫెస్టో ఉండబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీలను తలదన్నేలా, ఓటర్లను ఆకట్టుకునేలా ఈ మేనిఫెస్టో తయారు అయ్యిందని పార్టీ వర్గాలు చెప్తున్నారు. రైతులకు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఈ పార్టీ మేనిఫెస్టోలో గతంలోనే అమలు చేసిన రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వయసయిపోయి పని చేయలేని రైతుల కోసం రైతు పెన్షన్లను కూడా ఇస్తారని తెలియజేస్తున్నారు. అంతేకాక బీసీలు, మైనారిటీల కోసం కొత్త పథకాలు ఇస్తారు. నిరుద్యోగులు, విద్యార్థుల కోసం కూడా సరికొత్త స్కీములు రాబోతున్నాయి. మహిళా సాధికారత కోసం పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఈ పథకాలను ఉచిత పథకాలు కాదని సంక్షేమ పథకాలని, తమది సంక్షేమ ప్రభుత్వమని తెలియజేశారు మంత్రి కేటీఆర్. ఆదివారం మధ్యాహ్నంలోగా ఈ మేనిఫెస్టోని ప్రకటిస్తారని తెలియజేశారు. హుస్నాబాద్‌లో మొదటి సారిగా కేసీఆర్ సభలు ప్రారంభించేలోపలే ఈ మేనిఫెస్టో ప్రకటిస్తారని కేటీఆర్ చెప్తున్నారు. సభలు జరుగుతున్నప్పుడు కూడా అప్పటికప్పుడే ప్రజాభిప్రాయాలకు, వారి డిమాండ్లకు తగినట్లు మేనిఫెస్టోలో కొత్త పథకాలు కూడా కలుపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎలాగైనా ఈసారి గెలిచి, తెలంగాణాలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్నదే బీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.