NationalNews

అగ్నిపథ్… త్రివిధ దళాదిపతులతో ప్రధాని ఇవాళ భేటీ

Share with

త్రివిధ దళాదిపతులు ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్ చీ‌ఫ్‌లు ప్రధాని నరేంద్ర మోదీతో ఇవాళ భేటీ కానున్నారు. సాయుధ బలగాల కోసం కేంద్రం ప్రతిపాదించిన అగ్నిపథ్ నియామక ప్రక్రియకు వ్యతిరేకంగా… వారం రోజులుగా దేశమంతటా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, ముగ్గురు సర్వీస్ చీఫ్‌లతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. కేంద్రం మూడు సాగు చట్టాలు విషయంలో వెనక్కి తీసుకున్నట్టే అగ్నిపథ్ ఉపసంహరించుకుంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలో ప్రధాని మోడీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కొన్ని నిర్ణయాలు మొదట ఇబ్బందిగా ఉంటాయని… తర్వాత అవే దేశ నిర్మాణానికి దోహదపడతాయన్నారు. ‘అగ్నిపథ్’ మిలిటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన తప్పక వినాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఐతే అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. దేశానికి ఈ పథకంతో ఎంతో మేలు జరుగుతోందని ఆర్మీ ఇప్పటికే స్పష్టం చేసింది. అగ్నిపథ్ ద్వారా ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌లలో చేరేవారికి భవిష్యత్ బంగారు మయంగా ఉంటుందని ఆర్మీ తేల్చి చెబుతోంది. అగ్నివీరుల కోసం కేంద్రం ఇప్పటికే పలు డిఫెన్స్ సర్వీసుల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. అగ్నివీరుల కింద సెలక్ట్ అయిన వారిలో 25 శాతం మంది వివిధ విభాగాల్లోకి తీసుకోగా… అనేక మందికి మిగతా సర్వీసుల్లో అవకాశాలు లభించనున్నాయ్. అదే సమయంలో అగ్నివీరులకు ఇండస్ట్రీ నుంచి సైతం మద్దతు లభిస్తోంది. ఆనంద మహిద్రాతోపాటు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తో సహా పలువురు ప్రముఖులు అగ్నివీరులకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయంటున్నారు. ఇండస్ట్రీకి మెరికల్లాంటి అగ్నివీరులు ఎంతో అసరమని… వారికి ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయని బిజినెస్ కమ్యూనిటీ చెబుతోంది.