ఇరాన్ వార్ తో కండోమ్స్‌కు భారీ డిమాండ్
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఊహించని విధంగా సామాన్యుల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న నౌకాదళ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో కండోమ్ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ అయిన మలేషియాకు చెందిన ‘కారెక్స్’, తమ ఉత్పత్తుల ధరలను 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం డ్యూరెక్స్, ట్రోజన్ వంటి ప్రముఖ బ్రాండ్ల పైన కూడా పడనుంది. యుద్ధ భయాలు కేవలం చమురు ధరలకే పరిమితం కాకుండా, నిత్యావసర ,ఆరోగ్య రక్షణ ఉత్పత్తుల సరఫరా గొలుసును దెబ్బతీశాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
కారెక్స్ సీఈఓ గో మియా కియాట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ముడి పదార్థాల కొరత. కండోమ్ తయారీకి అత్యంత అవసరమైన అమ్మోనియా, సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్లు వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరాకు హర్మూజ్ జలసంధి కీలకం. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ గ్యాస్ , ముడి చమురులో ఐదో వంతు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల వల్ల రవాణా వ్యయం పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
రెండవది, అనిశ్చితి సమయంలో పెరిగిన డిమాండ్. విచిత్రంగా యుద్ధ భయాలు లేదా ఆర్థిక మాంద్యం నెలకొన్న సమయంలో కండోమ్స్‌కు డిమాండ్ సుమారు 30 శాతం పెరుగుతుందని కారెక్స్ పేర్కొంది. భవిష్యత్తుపై భరోసా లేనప్పుడు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైనప్పుడు ప్రజలు ‘ఫ్యామిలీ ప్లానింగ్’ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే అమ్మకాలు పుంజుకున్నాయని సంస్థ విశ్లేషించింది. ఏటా 500 కోట్లకు పైగా కండోమ్స్‌ను తయారు చేసే కారెక్స్ వంటి దిగ్గజ సంస్థే ధరలు పెంచడంతో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అటు విమాన ప్రయాణాలు, ఇటు నిత్యావసర వస్తువులతో పాటు పర్సనల్ కేర్ ఉత్పత్తులు కూడా భారంగా మారడం పశ్చిమాసియా సంక్షోభ తీవ్రతను సూచిస్తోంది.

