ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ‘చీకటి రోజు’ అని ఆయన ‘ఎక్స్ ‘వేదికగా విమర్శించారు.
ఈ నిర్ణయం కేవలం ఒక తీర్పు మాత్రమే కాదని, అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ వ్యవస్థలను తమకు అనుకూలంగా ఎలా వాడుకుంటున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, దానికి స్పీకర్ ముద్ర వేయడం వల్ల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని పరిణామాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.
దానం నాగేందర్‌పై చర్యలు ఖాయమని, ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ బలంగా నమ్మిందని, కానీ స్పీకర్ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పటికే స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ జరగనున్న నేపథ్యంలో, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

