Andhra PradeshNews

ఉచితాలపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల కలకలం

Share with

◆ ఈసారి ఎన్నికలకు ఉచిత పథకాలకు మోడీ స్వస్తి
◆ఉచిత పథకాలు దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు
◆ ఉచితాలను తీవ్రంగా పరిగణిస్తున్న సుప్రీంకోర్టు
◆ తెలుగు రాష్ట్రాలే టార్గెట్
◆ ఏపీలో ఉచితాలకు లక్షల కోట్లు

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రతి పార్టీ ముందుగా పేద, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలే టార్గెట్‌గా ఎన్నికల హామీలను గుప్పిస్తున్నాయి. కలర్ టీవీ నుండి మొదలుకొని ఉచితలకు ఏది అనర్హం కాదన్నట్లు ప్రతి పార్టీ వారి వారి రాష్ట్రాల్లో వారి వారి ప్రాంతాల ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉచిత హామీలను ఇస్తూ ఎన్నికల రణరంగంలో గట్టెక్కుతూ వస్తున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక కొన్ని పార్టీలు ఆ హామీలను అమలు చేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఖజానాలో డబ్బులు లేక చతికల పడుతున్నాయి. కానీ ఉచితం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని ప్రధాని మోడీ యూపీలో బుందేల్ఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో తన మనసులోని మాటను మొదటిసారిగా బయటపెట్టారు. ఈ ప్రకటనతో దేశంలోని అన్ని పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. మోడీ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అని ఆలోచనలో పడ్డాయి. ఎన్నికలలో ఉచిత హామీలు ఇవ్వకుండా మోడీ ఏదైనా చట్టం చేయనున్నారా అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈసారి జరిగే ఎన్నికల నాటికి దీనిపై మోడీ క్లారిటీ ఇస్తే తమ తమ రాష్ట్రాల్లోని పేద వర్గాలను ఎలా ఆకట్టుకోవాలో అనే మీమాంసలో ఆయా రాజకీయ పార్టీలు పడ్డాయి.

ప్రతి రాష్ట్రంలో తమ తమ బడ్జెట్ లో సంక్షేమానికి ఉచితానికి కేవలం కొంత శాతం మాత్రమే బడ్జెట్‌ను కేటాయించాలనే నిబంధన మోడీ అమలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో అప్పులు తెచ్చి మరి లక్షల కోట్లు ఉచిత పథకాలకు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో భారతదేశం కూడా మరో శ్రీలంక కాకముందే మోడీ వ్యూహం అమలు చేస్తున్నారని అందరు భావిస్తున్నారు. మోడీ ప్రకటన అనంతరం ఈ విషయం తిరిగి తిరిగి సుప్రీం కోర్టుకు చేరింది. ఉచిత హామీలను ప్రకటించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ అడ్వొకేట్ అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో రాజకీయ ఆర్థిక వ్యవస్థకు ప్రజా సంక్షేమానికి మధ్య నిర్దిష్టమైన సమతుల్యత పాటించాలని అన్నారు.

రాజకీయ పార్టీలు మాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కానీ భారతదేశం వంటి దేశంలో పేదరికాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఉచిత హామీలపై ఇరుపక్షాల వాదనలు వినటానికి ఒక కమిటీని కూడా చీఫ్ జస్టిస్ నియమించారు. కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, మోడీ ఉచిత పథకాలు వాటి వల్ల దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తుంది. దీనిపై రానున్న కాలంలో దేశానికి ప్రమాదం జరగకముందే మోడీ మంచి నిర్ణయం తీసుకుపోతున్నారనేది రాజకీయ విశ్లేషకులు మాట. ఉచిత హామీలతో నిజాయితీగా పన్నులు చెల్లించే వాళ్లకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని నియమించడంతో భవిష్యత్తులో ఉచితాలు అనే అంశంపై ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.