NationalNews

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి రూ.3,982 కోట్లు: నీతి ఆయోగ్‌

Share with

నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించడం దురదృష్టకరమని ఆ సంస్థ పేర్కొన్నది. శనివారం కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్‌ను తూర్పారబట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ వెంటనే ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ అనేది దేశంలోని అత్యున్నత రాజకీయ వేదిక అని పేర్కొన్నది. రాష్ట్రాల స్థాయిల్లో కీలకమైన అభివృద్ధి, సమస్యలపై చర్చించి, జాతీయ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వేదిక అని తెలిపింది. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని తయారు చేయాలన్న ఉద్దేశ్యంతోనే నీతి ఆయోగ్‌ ఓ సంస్థగా ఏర్పాటైందని గుర్తు చేసింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని తెలిపింది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌, సభ్యులు గత సంవత్సరం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించినట్లు గణాంకాలతో సహా వెల్లడించింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు ఈ సమావేశాల్లో పరిష్కారమయ్యాయని పేర్కొన్నది. తెలంగాణలోనూ సమస్యల పరిష్కారానికి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ కృషి చేశారని తెలిపింది. వైస్‌ చైర్మన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గతేడాది జనవరి 21వ తేదీన హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమైందని గుర్తు చేసింది. ఇటీవల మరో సమావేశం కోసం నీతి ఆయోగ్‌ ప్రయత్నించినప్పటికీ కేసీఆర్‌ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని సమస్యలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రిత్వ శాఖలు చర్చిస్తున్నాయని నీతి ఆయోగ్‌ పేర్కొన్నది. ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి సంబంధించిన అజెండాపై తెలంగాణాతో సహా వివిధ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం వివరంగా చర్చించిందని తెలిపింది. ఈ సమావేశానికి అనుసంధానంగానే జూన్‌ నెలలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారని గుర్తు చేసింది. ఆ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారని తెలిపింది. నీతి ఆయోగ్‌ సమావేశానికి ఎజెండా తయారీలో రాష్ట్రాలు సహకరించడం లేదన్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆరోపణలను ఖండించింది. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.3,982 కోట్లు కేటాయించిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించిందని పేర్కొన్నది. ప్రధానమంత్రి కృషి సంచార్‌ యోజన, నీటిపారుదల పథకాల కింద తెలంగాణాకు 2014-2022 మధ్య కాలంలో రూ.1195 కోట్లు విడుదల చేశామని నీతి ఆయోగ్‌ గణాంకాలు విడుదల చేసింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన పథకాలు, కార్యక్రమాలతో సహా ఆర్థిక విషయాల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రాలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నది. 14వ ఆర్థిక సంఘం నిధులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగినంత సౌలభ్యం కూడా కల్పించిందని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది.