వైఎస్ విజయమ్మ గృహ నిర్బంధం.. ఇంట్లోనే దీక్ష
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్టుతో ఆమె తల్లి విజయమ్మ రంగంలోకి దిగారు. ఎస్‌ఆర్ నగర్‌కు తరలించిన షర్మిలను పరామర్శించేందుకు బయల్దేరిన విజయమ్మను పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విజయమ్మ లోటస్‌పాండ్‌లోని తన ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగారు. తన కూతుర్ని చూసేందుకు కూడా పోనీయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా..? అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలందరినీ పిలవమంటారా..? రాష్ట్రమంతా బంద్‌లు, గొడవలు చేయమంటారా..? అని పోలీసులను హెచ్చరించారు. అయినా.. తమకు పైనుంచి ఆదేశాలు ఉండటంతో వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు వెళ్తున్నారన్న భయంతోనే విజయమ్మను అరెస్టు చేశామని తెలిపారు.