Andhra PradeshNews

రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 200 కోట్లు

◆ రబీ 2020–21, ఖరీఫ్‌–21 సీజన్‌ల సున్నా వడ్డీ రాయితీ
◆ ఖరీఫ్‌–2022 సీజన్‌కు చెందిన ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ
◆ రుణ మాఫీ చేస్తామని రైతులను మోసం చేసిన చంద్రబాబు
◆ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: సీఎం జగన్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు దారుణంగా మోసం చేశారన్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ రబీ 2020–21, ఖరీఫ్‌–2021 సీజన్లకు సంబంధించిన వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్‌–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ. 199.94 కోట్లు బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. రబీ 2020–21 సీజన్‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ. 45.22 కోట్లు, ఖరీఫ్‌–2021 సీజన్‌లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ. 115.33 కోట్లు విడుదల చేశారు. అదే విధంగా ఖరీఫ్‌–2022 సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్‌ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఖరీఫ్‌ సీజన్‌ ముగియక ముందే జమ చేసి అండగా నిలిచారు.

May be an image of 11 people and indoor

గత ప్రభుత్వ హయాంలో అన్నీ అశాస్త్రీయంగా చేశారని సీఎం జగన్ స్పష్టం చేశారు. పంట నష్టాల అంచనా నుంచి రైతన్నల మధ్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి ఉండేదన్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా అదీ తమకు కావాల్సిన వారికే సాయం అందించారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఈ– క్రాప్‌ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నామన్నారు. అంతేకాక.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్‌ ఆడిట్‌ కింద రైతుభరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు.. అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించామని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 21 లక్షల 31 వేల మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ. 1834.79 కోట్లు ఇచ్చామన్నారు. పంట రుణాల మీద వడ్డీ భారం లేకుండా చేసేందుకు వరుసగా 3వ ఏడాది సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. అందుకోసం 8,22,411 మంది రైతులకు రూ. 160 కోట్ల 55 లక్షలు జమ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి 73 లక్షల 88 వేల మంది రైతులకు రూ. 1834.55 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు.

May be an image of 6 people, people sitting and people standing

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ పథకం కింద ఈ విడతలో రూ. 200 కోట్లు జమ చేస్తున్నామన్నారు. 2022 జూలై నుంచి అక్టోబర్ మధ్యలో కురిసిన వర్షాలకు 45,998 మంది రైతులకు నష్టం కలిగితే రూ. 40 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ మొత్తాన్ని ఈ ఖరీఫ్ సీజన్ ముగియకముందే రైతులకు జమ చేస్తున్నామని వివరించారు. ఇవేవీ గత ప్రభుత్వ హయాంలో లేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొట్టిందని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందన్నారు. అందుకోసమే క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. జూలై-అక్టోబర్‌ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నామని సీఎం జగన్ వివరించారు.