Andhra PradeshHome Page Slider

మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు జగన్ శ్రీకారం ?

  • ఏప్రిల్ మొదటి వారంలో పలువురికి ఉద్వాసన..
  • ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సమాచారం
  • సామాజిక వర్గాల వారీగా కూర్పుపై జగన్ కసరత్తులు
  • సామాజిక వర్గాల వారీగా కూర్పుపై జగన్ కసరత్తులు

ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ సంఘటనలు బట్టి చూస్తుంటే త్వరలోనే మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టి ఒక నలుగురికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మూడోసారి మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ మార్పులు చేర్పులు ఉంటాయని తాడేపల్లి కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎంఓ నుండి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం నాటి గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో మంత్రివర్గం మార్పుపై జగన్ క్లారిటీ ఇచ్చే క్రమంలో అందుకు సంబంధించిన నలుగురు మంత్రులకు ముందస్తుగానే వారితో చర్చించి మార్పులకు గల కారణాలను వివరించినట్లు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సమాచారాన్ని పంపించారని అంటున్నారు.

రెండు రోజులు ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్ సామాజిక వర్గాల వారీగా మంత్రివర్గంలో మార్పు చేర్పులకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటు పార్టీ పరంగా అటు పాలనా పరంగా ఆయన దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఈసారి కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి తప్పనిసరిగా ఒక బెర్త్ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో 25 మంది మంత్రులున్నారు. వారిలో ఎంత మందిని తప్పించి తిరిగి ఆస్థానంలో ఎంతమంది కొత్తవారికి అవకాశం కల్పిస్తారన్నదానిపై ప్రస్తుతం ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ వార్తల నేపథ్యంలో అకస్మాత్తుగా మంత్రి సిదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌లు శుక్రవారం తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మంత్రి పదవులు మార్పులు నేపథ్యంలోనే వారు ఇరువురు వచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఒక దశలో సిదిరి అప్పలరాజు మంత్రి పదవి తీసేసి తమ్మినేని సీతారామ్‌కు ఇస్తారని ప్రచారం కూడా సాగింది. ఇదే సమయంలో డాక్టర్ అచ్చెన్న మరణం అంశానికి సంబంధించి సంబంధిత మంత్రి కాబట్టి సిద్దిరి అప్పలరాజును పిలిపించారంటూ మరో ప్రచారం జరిగింది.

ఐతే, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బయటకు వచ్చిన ఇద్దరు నేతలు మాట్లాడుతూ అసలు మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకి రాలేదంటూ కొట్టిపారేశారు. గత ఎడాది ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన రెండో మంత్రివర్గ విస్తరణా లానే ఈ ఏడాది కూడా మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టి ఎన్నికలకు వెళ్లే విధంగా ప్రణాళికలు జగన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కొంతమంది మంత్రులను మార్చేస్తారని ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం కోఆర్డినేటర్లలో టెన్షన్ మొదలైంది. అసలు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసలు జగన్ ముందస్తుకు వెళ్తారా లేక ఈ ఉన్న ఏడాదిలోనే మంత్రులు మార్చేస్తారా అన్నదానిపై ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై జరిగే చిట్టచివరి వర్క్ షాపులో ఈ ఊహగానాలకు అన్నిటికి తెరపడనుంది.