మీ సేవలు చాలు..ఇక ఇంటికి దయచేయండి
హ్యాపీ న్యూ ఇయర్ మొదలయ్యాక….రెండు వర్గాల్లో రెండు రకాల భయాలు మొదలయ్యాయి. కొత్త ఏడాదిలో ఉద్యోగాల కోతలు,చైనా వైరస్ రెండూ ప్రారంభమయ్యాయి. మొన్నటివరకు మాంద్యం భయాలు, ఏఐను కారణంగా చూపి ఖర్చులు తగ్గించుకోవడం అంటూ ఉద్వాసన పలికిన సంస్థలు నేడు ప్రతిభ లేనివారిని ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది.‘‘మైక్రోసాఫ్ట్‌లో మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులను ప్రోత్సహిస్తాము. కొత్త విషయాలు నేర్చుకొనేందుకు, ఎదిగేందుకు ప్రయత్నించేవారికి మేము ఎప్పుడూ తోడుంటాం. పనిచేయని వారిపై తగిన చర్యలు తీసుకుంటాం’’ అని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి అన్నారు. మెరుగైన పనితీరు చూపించే వారి సంఖ్యను పెంచుకొనే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకుంది. 2023 లో కంపెనీ దాదాపు 10వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇది కంపెనీ శ్రామికశక్తిలో 5 శాతం. గతేడాదిలో గేమింగ్ విభాగం నుంచి దాదాపు 2వేల మందిని తొలగించింది. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కంపెనీలు తమ వ్యూహాలను అమలుచేయడంలో భాగంగా ఈ ఏడాదిలోనూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో లేఆఫ్‌లు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.