ట్రంప్ ‘ బోర్డు ఆఫ్ పీస్’ రూల్స్ తెలిస్తే షాకే..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డు ఆఫ్ పీస్’ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్–గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా ధ్వంసమవడంతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు ట్రంప్ ఇటీవల ‘బోర్డు ఆఫ్ పీస్’ను ఏర్పాటు చేశారు. ఇది కేవలం గాజా పునర్నిర్మాణానికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలను పరిష్కరించే దిశగా విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ తిరకాసు పెట్టారు. బోర్డు ఆఫ్ పీస్‌లో శాశ్వత సభ్యత్వం కావాలంటే 1 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించాల్సిందేనని ఆయన తాజాగా ఒక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం విశ్వవేదికపై మిశ్రమస్పందన లభిస్తోంది.
అంతర్జాతీయ సంస్థగా పనిచేయనున్న బోర్డు ఆఫ్ పీస్‌కు ఛైర్మన్‌గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు, రాజకీయ సంక్షోభాలు ఉన్న ప్రాంతాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ బోర్డులో చేరేందుకు ట్రంప్ యంత్రాంగం దాదాపు 60 దేశాలకు ఆహ్వానం పంపినట్లు సమాచారం.
ట్రంప్ ఛైర్మన్‌గా మాత్రమే కాకుండా అమెరికా తరఫున ప్రత్యేక ప్రతినిధిగా కూడా సేవలందిస్తారు. బోర్డు లక్ష్యాలను అమలు చేయడానికి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం, మార్పులు చేయడం లేదా రద్దు చేయడం వంటి పూర్తి అధికారాలు ఛైర్మన్‌కే ఉంటాయి. సభ్య దేశాలకు మూడేళ్ల పాటు పదవీకాలం ఉన్నప్పటికీ, వారిని ఎప్పుడైనా తొలగించే అధికారం బోర్డు ఛైర్మన్ కు ఉంటుంది.
ఛైర్మన్‌ను మార్చడం దాదాపు అసాధ్యం. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, లేదా అనారోగ్యం వంటి కారణాలతో బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితి వచ్చినా మాత్రమే మార్పు ఉంటుంది. బోర్డు తరపున ట్రంప్ స్వయంగా తీర్మానాలు చేయడం, ఆదేశాలు జారీ చేయడం కూడా చేయవచ్చు.
బోర్డు ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) విరాళంగా ఇచ్చే దేశానికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. అటువంటి దేశాలకు మూడేళ్ల కాల పరిమితి వర్తించదు. కీలక నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుల పదవీకాలం మాత్రం రెండేళ్లు మాత్రమే.
ప్రతి సంవత్సరం ఓటింగ్ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు ఉంటుంది. సమావేశానికి హాజరైన దేశాల్లో మెజారిటీ మద్దతు లభిస్తే నిర్ణయం ఆమోదం పొందుతుంది. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు ఛైర్మన్‌కు అదనపు నిర్ణయాత్మక ఓటు ఉంటుంది. మెజారిటీ మద్దతు ఉన్నా కూడా ఛైర్మన్ ఆమోదం తప్పనిసరి. ఆయనకు నచ్చకపోతే నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం ఉంది.
ఈ బోర్డులో ట్రంప్‌తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక సంధానకర్త స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్, బిలియనీర్ మార్క్ రోవాన్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, జాతీయ భద్రతా మండలి సభ్యుడు రాబర్ట్ గాబ్రియేల్ వంటి ప్రముఖులు ఉన్నారు. రష్యా, భారత్, ఈజిప్ట్, కెనడా, పాకిస్తాన్ , జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలకు ఆహ్వానాలు అందాయి. కనీసం మూడు దేశాలు నిబంధనలకు అంగీకరిస్తూ సంతకం చేసిన తర్వాత ఈ బోర్డు అధికారికంగా అమల్లోకి రానుంది.

