Home Page SliderTelangana

మొన్న నో.. నేడు ఎస్.. ఫార్మా సిటీపై మారిన రేవంత్ వైఖరి

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ప్రాజెక్టును గానీ, ఫార్మా సిటీని గానీ తమ ప్రభుత్వం రద్దు చేయడం లేదని, గత ప్రభుత్వం రూపొందించిన వాటిని క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు ప్రాజెక్టులలో మార్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. “ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేము వాటిని క్రమబద్ధీకరిస్తున్నాం. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గాలకు బదులుగా, మేము విమానాశ్రయానికి దూరం తగ్గించడంతోపాటు, ఖర్చును తగ్గిస్తాం”. అని చెప్పారు. గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి పెద్దగా ప్రయాణికుల రాకపోకలు ఉండవని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే ప్రణాళికను రూపొందించిందని చెప్పారు.

ఇప్పుడు, మెట్రో నెట్‌వర్క్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) నుండి ఓల్డ్ సిటీ మీదుగా శంషాబాద్‌లోని విమానాశ్రయానికి కలుపుతుందన్నారు. హైటెక్ సిటీ సమీపంలోని రాయిదుర్గం నుంచి మెట్రోను పొడిగించే పాత స్కీమ్‌కు బదులుగా, ఇప్పుడు నాగోల్ నుండి ఎల్‌బీ నగర్, ఒవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి, ఆపై విమానాశ్రయానికి అనుసంధానించనున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైతే మైండ్‌స్పేస్‌లోని ఐటీ హబ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. ప్రతిపాదిత ప్రణాళికకు గత ప్రభుత్వం అనుకున్న దానికంటే చాలా తక్కువ ఖర్చవుతుందని, ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేయలేదని, దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

“మేము ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా సిటీగా క్లస్టర్లను సృష్టిస్తాం. అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం నివాస ప్రాంతాలతో క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. వారు హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. జీరో పొల్యూషన్‌తో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మెట్రో, ఫార్మా సిటీ ప్రాజెక్టులు రాబోయే ప్రాంతాలలో గత పాలనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని, ఈ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పునరాలోచన చేయాలన్న భావన వ్యక్తమవుతోంది.