వైఎస్ జగన్ కొత్త ఫార్ములా
◆ ఎన్నికలకు సంవత్సరం ముందే నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు
◆ ఎమ్మెల్యే ఉండగానే ఆయా నియోజకవర్గాలకు అదనపు సమన్వయకర్తల నియామకం
◆ పనితీరు మెరుగుపరుచుకొని ఎమ్మెల్యేలు
ఔట్
◆ భవిష్యత్తుపై బెంగతో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు
◆50 నుండి 60 మంది అభ్యర్థులను జగన్ మారుస్తారని జోరుగా ప్రచారం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్ కొత్త ఫార్ములాకు తెర తీశారు. ఎన్నికలు జరిగే ఒక సంవత్సరం ముందు నాటికే ప్రజల్లో విశ్వాసం లేని, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశంతో ఆయా నియోజకవర్గాల్లో అదనపు సమన్వయకర్తల పేరుతో నియామకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా రాజధాని నుంచి ప్రక్షాళన మొదలుపెట్టిన జగన్ తొలిగా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఈసారి టికెట్ లేదని సంకేతాలను ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన జగన్ ప్రతి అంశంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ 175 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో అనుకున్న టార్గెట్ ప్రకారం గెలవాలి అంటే సరైన అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలని ఇప్పటినుండే ప్రక్షాళన ప్రారంభించారు.

పీకే టీం నిర్వహించిన సర్వేలలో పూర్తిగా గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేలను మార్చి త్వరలోనే మరిన్ని నియోజకవర్గాలకు అదనపు సమన్వయకర్తలను జగన్ నియమిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముందుగా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తను నియమించిన జగన్ ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని లేదంటే నిర్దాక్షిణ్యంగా మార్చేస్తానన్న పరోక్ష సంకేతాలు పంపారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నడపాలని ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించే దిశగా ప్రతి ఎమ్మెల్యే వ్యవహరించాలని ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలని పలు సమీక్షల్లో ఎమ్మెల్యేలకు సూచించిన జగన్ వెనుకబడిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం ద్వారా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయించనని ముక్కు సూటిగా చెబుతూ వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు వారికి ఉన్న కుటుంబ రాజకీయ నేపథ్యం రాజకీయ అనుభవం దృష్ట్యా జగన్ మాటలను పెడచెవిన పెట్టగా మరికొంతమంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన జగన్ తాడికొండకు అదనపు సమన్వయకర్తను నియమించి ఎమ్మెల్యేలలో బెంగ మొదలయ్యేలా చేసి కచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయని సంకేతాలను ఎమ్మెల్యేలకు ఇచ్చారు.

ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై పీకే టీం ద్వారా సర్వే చేయిస్తున్న జగన్ ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులలో అలానే సీఎం పనితీరుపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని జగన్ కు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఎమ్మెల్యేలు పనితీరు ఆధారంగా సర్వేల రిపోర్టుల ఆధారంగా చాలా నియోజకవర్గాల్లో మార్పులు ప్రక్రియ జగన్ చేస్తారని తెలుస్తుంది. ముందుగానే అదనపు సమన్వయకర్తల పేరుతో అభ్యర్థులను ప్రకటించి ఆ నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇవ్వటం ద్వారా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. వివిధ రకాల సామాజిక కోణాలు ద్వారా అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల బరిలోకి బలమైన అభ్యర్థులను ఈసారి జగన్ నిలబెట్టబోతున్నారు.

కచ్చితంగా 60 నుండి 70 మంది ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఉండవని ఆ పార్టీ వర్గాల్లో కార్యకర్తలలో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. మరి రాబోవు రోజుల్లో ఏ ఏ నియోజకవర్గాల కు అదనపు సమన్వయకర్తలను జగన్ నియమిస్తారు ? ఇప్పటికిప్పుడే అభ్యర్థుల మార్పు ద్వారా జగన్ ఎత్తుగడ ఫలిస్తుందా ? టికెట్లు కోల్పోతున్నామన్న సంకేతాలతో పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శించి గందరగోళాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తేరా తీస్తారా ? జగన్ కొత్త ఫార్ములా ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

