ఆమె మరణశిక్షను రద్దు చేసిన యెమెన్
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు పెద్ద ఊరట లభించింది. ఆమె మరణశిక్ష ఇప్పుడు అధికారికంగా రద్దు అయింది. ఈ శుభవార్తను భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాలయం పంచుకుంది. “గతంలో వాయిదా పడ్డ నిమిష ప్రియ మరణశిక్ష ఇప్పుడు పూర్తిగా రద్దు చేయబడింది” అని గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబుబాకర్ ముస్లయ్యర్ జోక్యం చేసుకుని యెమెన్ అధికారులను నిమిష మరణ శిక్షను పునఃపరిశీలించాలని అభ్యర్థించడంతో జులై 16న అమలు చేయాల్సిన ఆమె ఉరిశిక్షను ఒక రోజు ముందే తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం, గ్రాండ్ ముఫ్తీ.. యెమెన్ ప్రభుత్వంతో వరుస చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగా తాజాగా యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిమిషకు ఉరిశిక్షను రద్దు చేస్తూ యెమెన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి యెమెన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు వెల్లడికాలేదని, దీనిని నిర్ధారిస్తూ భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ అత్యున్నత సమావేశంలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టులో మాట్లాడుతూ అన్నారు. బలమైన దౌత్యపరమైన చర్యల కోసం అభ్యర్థనను విచారిస్తున్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది.
అసలేం జరిగింది :
యెమెన్ జాతీయుడు మహద్ హత్యకేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. మహద్‌తో కలిసి ఆమె వ్యాపారం చేసింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె తన పాస్‌పోర్టు కోసం అడిగింది. కానీ పాస్‌పోర్టు ఇచ్చేందుకు మహద్ నిరాకరించడంతో అతడికి మత్తుమందు ఇచ్చి తీసుకునేందుకు నిమిష ప్రయత్నించింది. అయితే డోస్ ఎక్కువ కావడంతో మహద్ మృతిచెందాడు.
దాంతో యెమెన్ పోలీసులు నిమిషను హత్య కేసులో అరెస్ట్ చేశారు. ఆమె ముందుగా స్థానిక కోర్టు మరణశక్ష విధించింది. ఆ శిక్షను టాప్ కోర్టు సమర్థించింది. దాంతో ఈ నెల 16న నిమిషకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ రోజు ఆమెకు అమలు చేయాల్సిన మరణశిక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు పూర్తిగా రద్దు అయింది.