తమిళనాడులో రాక్షసి చీమల బీభత్సం
చీమలు చాలా చిన్న జీవులు. అసలు అవంటేనే మనకు ఏం లెక్కలేదు. అవేం చేస్తాయిలే అనుకుంటాం. ఏదైనా చాలా చిన్న విషయం అని చెప్పాలంటే చీమతో పోలుస్తుంటాం. అలాగని అన్ని చీమలను ఒకేలా చూడకూడదండోయ్. చీమల వల్ల చూపు కోల్పోయే పరిస్థితి వస్తోందంటే అవి ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలి.

తమిళనాడులోని YELLOW CRAZY ANTS అనే రకం చీమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి కారణంగా చాలామంది వారి ఇళ్ళు వదిలి వేరే ప్రాంతాలకు వలస పోతున్నారట. ఇవి లక్షల సంఖ్యలో గుంపులుగా దండెత్తి మనుషులను బెంబేలెత్తిస్తున్నాయి. తమిళనాడులోని అటవీప్రాంతాలలో పలు గ్రామాలలో ఈ చీమలు ఈ చీమలు ఏది పడితే దాన్ని తినేస్తున్నాయి. సన్నగా, చిన్నగా ఉండే ఈ చీమలు చిన్నచిన్న కీటకాలను, పురుగులనే కాదు, ఎలుకలు, పిల్లులు, కుందేళ్లను కూడా స్వాహా చేస్తున్నాయిట. పాములు, బల్లులను కూడా గుంపులుగా చుట్టుముట్టి చాలా ఈజీగా భోంచేసేస్తున్నాయి. పశువులకు కూడా గాయాలైన చోట దాడిచేసి వాటి మాంసాన్ని తినేస్తున్నాయి. మేకలు, ఎద్దులకు వీటి కారణంగా కంటిచూపు కోల్పోతున్నాయని కూడా సమాచారం. ఇవి దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వు ఫారెస్టు పరిసరాలాలోని సుమారు ఏడు గ్రామాలపై దండయాత్ర చేస్తున్నాయి.

ఇవి అడవులనుండి లక్షల సంఖ్యలో గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. వీటి ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇవి వాటి పొత్తికడుపు వద్ద ఉండే ఒక చిన్న గొట్టం ద్వారా భయంకరమైన ఫార్మిక్ యాసిడ్‌తో కలిసిన ద్రవాన్ని వెదజల్లుతాయి. ఆ ద్రవం పడిన ప్రదేశంలో దురద, చర్మం పొట్టుగా రాలడం వంటి సమస్యలు వస్తాయి. పశు పక్ష్యాదుల కళ్లలో పడితే వాటి చూపు కోల్పోతాయి. చీమల మందులు జల్లుతున్నా అవి పోవడం లేదు. అందుకే అక్కడి ప్రజలు ఈ చీమల బెడద పడలేక ఆ ప్రదేశాలనుండి వలసలు మొదలు పెట్టారు.

వాటిపై సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ప్రతినిధులు వీటిపై పరిశోధనలు చేసారు. వారి పరిశోధనలో ఇవి ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. 5 మి.మీ వరకూ పొడవు పెరుగుతాయని, తలపై యాంటెన్నాతో పసుపు రంగులో ఉంటాయని, 80 రోజులవరకూ బతుకుతాయని కనిపెట్టారు.
ఆస్ట్రేలియాలోని క్రిస్‌మస్ ఐలాండ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే వస్తే వారు హెలికాప్టర్ల ద్వారా మందుల్ని పిచికారి చేయగా 95 శాతం ఫలితాలు వచ్చాయట. చిన్న తుమ్మెదలాంటి కీటకం ద్వారా సహజ పద్దతిలోనే వాటి ఆహారగొలుసును తెంపి వాటి సంతతి పెరగకుండా కూడా చూసేలా పరిశోధనలు చేస్తున్నారు.

