Andhra PradeshNews

వైసీపీ బీసీ అస్త్రం… టీడీపీకి చెక్ పెట్టేలా మహాసభ

◆ పార్టీ మినీ ప్లీనరీ తరహాలో భారీ ఏర్పాట్లు
◆ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మహాసభ
◆ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ ప్రజాపతినిధికి ఆహ్వానాలు
◆ గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రానున్న నేతలు

ఏపీలో వైసీపీ నిర్వహిస్తున్న జయహో బీసి మహాసభకు సర్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు రాష్ట్రంలోని వివిధ హోదాల్లో ఉన్న 82,000 మంది ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఉదయం 11:50 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు హాజరై మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రసంగించనున్నారు. గడిచిన మూడున్నర ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం అనేది సీఎం జగన్ వివరించనున్నారు. బీసీల్లోని ఆయా సామాజిక వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారి మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ బోర్డు సభ్యుల నుంచి గ్రామ సర్పంచులు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజ్యసభ సభ్యుల వరకు ప్రభుత్వం పార్టీలోనూ ఆయా పదవుల్లో ఉన్న బీసీలు ప్రతి ఒక్కరు జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.

విజయవాడ నగరం నుంచి తాడేపల్లి వరకు జయహో బీసీ జండాలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు ట్రాఫిక్ మళ్ళించారు. జయహో బీసీ మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఆ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పార్టీ మినీ ప్లానర్ తరహాలో బీసీ మహాసభను వైసీపీ నిర్వహించబోతుంది. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు ఆయా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ ప్రతినిధికి తప్పనిసరిగా ఈ సభకు హాజరు కావాలంటూ వారం ముందే ఆహ్వానాలు పంపింది. వారిని తరలించే బాధ్యతలను రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం అప్పగించింది. మొత్తం 26 జిల్లాల నుంచి 86 వేల మంది సభకు హాజరవుతారని అంచనా వేసిన అధిష్టానం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. సభకు హాజరయ్యే వారికోసం ఉదయం అల్పాహారం కాఫీ ,టీ లతోపాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు. అధికారంలో సగం అవకాశాల్లో సగం అన్నట్లు ఇప్పటి బీసీలకు పెద్దపీట వేసిన వైసీపీ ప్రభుత్వం జయహో బీసీ మహాసభ వేదికగా ఆ వర్గాలపై వరాలజల్లు కురిపించనున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ ప్రభుత్వం బీసీ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.