Andhra PradeshNews

గోదావరి జిల్లాలో పావులు కదుపుతున్న వైసీపీ

◆ నేడు రాజమండ్రిలో కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక సమావేశం
◆ జనసేన లక్ష్యంగా కాపు ప్రజాప్రతినిధుల భేటీ
◆ పవన్ ను ఎదుర్కొని ఆయన ప్రభావాన్ని తగ్గించాలని భావిస్తున్న వైసీపీ

ఏపీలో ప్రధానంగా గోదావరి జిల్లాలో తెలుగుదేశం కంటే జనసేన పార్టీ వేగంగా పుంజుకుంటుంది. ఈ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో సీట్లు సాధించగలమన్న ధీమా పవన్ కళ్యాణ్ లో కూడా ఉంది. ఈ జిల్లాలో తెలుగుదేశం కంటే కూడా జనసేన పట్ల ఓటర్లు ఆకర్షితులవుతున్నారు. ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గీయుల సంఖ్య అధికం, అయితే గోదావరి జిల్లాలో సీట్లు పోగొట్టుకునేందుకు వైసీపీ సిద్ధంగా లేదు. ఈ కారణంగా గోదావరి జిల్లాలను ప్రాతిపదికగా చేసుకొని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ చేసే విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. గోదావరి జిల్లాలోని కాపులపై అధికార పార్టీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ జిల్లాలోని కాపు ఓటర్లు అంచలంచెలుగా అధికార పార్టీకి దూరమవుతున్న విషయాన్ని గుర్తించిన జగన్ ఇప్పటి నుండే పవన్ ని దీటుగా ఎదుర్కొని ఆయన ప్రభావాన్ని ఆ జిల్లాల్లో తగ్గించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సోమవారం ప్రత్యేకంగా రాజమండ్రిలోని మంజీరా హోటల్లో ఉదయం 10 గంటలకు కాపు ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కాపు మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా తదితరులతోపాటు ఎంపీలు వంగా గీత, వల్లభనేని బాలశౌరి పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కాబోతున్నారు. విశాఖ సంఘటనల అనంతరం పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను దుయ్యబట్టారు. అయితే దీనిపై కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు తగిన రీతిలో స్పందించలేదని దీనిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ధీటుగా ఎదుర్కొనేందుకు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పై అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమిష్టిగా ఇకనుండి కౌంటర్లు ఇవ్వాలని వైసీపి అధిష్టానం ఆలోచన. దీనిపైన ఈ రోజు జరిగే సమావేశంలో సవివరంగా చర్చించి విధివిధానాలు ఏ విధంగా ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.