వైయస్సార్సీపీలోకి యనమల కృష్ణుడు?
• తుని రాజకీయాల్లో రోజుకు ఒక మలుపు
• చంద్రబాబు హామీ ఇచ్చినా… పార్టీ మారే ఆలోచనలో కృష్ణుడు
• తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా యనమల దివ్యని ప్రకటించడంతో ఆగ్రహంలో కృష్ణుడు
• వైయస్సార్సీపి లోకి వస్తే త్వరలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్
• ఎన్ని కలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీ నుండి మరో పార్టీకి మొదలైన జంపులు
ఎన్నికలకు మరింత సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరగబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వెళుతుంటే మరికొందరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి రావటం సహజంగా జరిగేదేనని వారు అంటున్నారు. కానీ ఎన్నికలకు ఎంతో సమయం ఉన్నప్పటికీ అధికారపక్షంలో ఇమడలేని ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ హామీ పొంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చారు. అందులో నెల్లూరు జిల్లా నుండి ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పటికే ఆ పార్టీపై తిరుగుబావుట ఎగరవేశారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలలో ఇన్చార్జులను మారుస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా కొత్తగా తలనొప్పులు మొదలయ్యాయి. ఈ మధ్యకాలంలో నాలుగు నియోజకవర్గాలను కొత్త ఇన్చార్జిలను నియమించిన చంద్రబాబు తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి కూతురు యనమల దివ్య కు ఇన్చార్జి పదవిని కట్టబెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన యనమల రామకృష్ణుడి తమ్ముడు యనమల కృష్ణుడు పార్టీ మారాలని నిర్ణయించుకోవడంతో విషయం తెలుసుకున్న చంద్రబాబు హుటాహుటిన కృష్ణుడిని తన వద్దకు తీసుకురావాలని సమాచారం పంపించడంతో బుధవారం సొంత పార్టీ నాయకులు చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. తాజా పరిణమాలపై కృష్ణుడి ఆవేదనను చంద్రబాబు ఆసాంతం విన్నారని నాలుగు దశాబ్దాలుగా తుని రాజకీయాల్లో పండిన కృష్ణుడికి పార్టీ పరంగా తగిన ప్రాధాన్యత ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రస్థాయి కార్యదర్శి లేదా ఉపాధ్యక్ష పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని దీనికి కృష్ణుడు కూడా తల ఊపేసారని వెంట వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు వివాదం సద్దుమణిగిందంటూ ప్రకటించేశారు.

ఇక తునిలో తెలుగుదేశం పార్టీ ఏకచత్రాధిపత్తంగా విజయం సాధిస్తుందని హర్షం కూడా వ్యక్తం చేశారు. కానీ కృష్ణుడు అనుచరుల కథనం ఎందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రస్థాయి పార్టీలో కార్యదర్శులు ఉపాధ్యక్షులు సంఖ్య డజన్లకు పైగా ఉంటుందని వారికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదని పైగా ఈ పదవులు ఏమి చట్టబద్ధమైనవి కాదని కనీసం జిల్లా పార్టీ కార్యక్రమాల్లో కూడా వారికి పెద్ద పీట లభించదని వారికంటూ సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉండదని యనమల కృష్ణుడు ఆశిస్తున్నది చట్టసభల్లో పదవని అది ఆయన చిరకాల ఆకాంక్ష అని వారంటున్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కృష్ణుడి ముందు కళ్ళు తెరిచిన పిల్లలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని కానీ కృష్ణుడికి ఈసారైనా ఎమ్మెల్యే అవకాశం ఉంటుందని భావించామని కానీ ఆశ నిరాశ గానే మిగిలిపోయిందని కృష్ణుడి అనుచరులు అంటున్నారు. ఇదిలా ఉంటే కృష్ణుడితో వైసీపీ నాయకులు కొందరు చర్చలు కొనసాగిస్తున్నారు. బుధవారం నాటి పరిణామాలు నేపథ్యంలో ఈ చర్చలు వేగం పుంజుకున్నాయి. మంగళవారం మొదలైన ఈ చర్చలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. నేరుగా చంద్రబాబుతోనే కృష్ణుడికి రాజకీయ భవిష్యత్తుపై హామీని ఇప్పించాలని ప్రయత్నించాయి. అయితే తుని విషయంలో చంద్రబాబు కూడా ఇంతకు మించి మరే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు లేవు. ఒకసారి దివ్యకు ఖరారు చేసిన పార్టీ ఇంచార్జ్ పదవిని మారిస్తే యనమల రామకృష్ణుడు తో చిక్కులు తప్పవని నియోజకవర్గం లో పట్టు లేకపోయినా పార్టీలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న యనమల రామకృష్ణుడుని దూరం చేసుకోవడం చంద్రబాబుకు సాధ్యం కాదని తెలిసే ఆయన తమ్ముడు కృష్ణుడికి రాష్ట్రస్థాయి పదవి ఇవ్వగలను అంటూ చంద్రబాబు హామీ ఇచ్చినట్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

కాగా వైఎస్సార్సీపీలోకి వస్తే మూడు నాలుగు మాసాల్లో అందుబాటులోకి రానున్న మండలి సభ్యత్వ పదవుల్లో ఒకదాన్ని కృష్ణుడికి ఇవ్వటంతో పాటు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గం పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తునిలో యనమల రామకృష్ణుడు కంటే కృష్ణుడికి పట్టు పరపతి ఎక్కువ కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా ఆయనకి నేరుగా సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రత్తిపాడులో యాదవ కులస్తుల సంఖ్య అధికం కృష్ణుడికి ఈ నియోజకవర్గాల బాధ్యతను అప్పగిస్తే ఈ రెండింట్లో వైసీపీ విజయం నల్లేరు మీద నడకల సాగుతుందన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉంది. అందుకే కృష్ణుడిని పార్టీలోకి చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో కృష్ణుడు పార్టీ మారతారా చంద్రబాబు ఇచ్చే పార్టీ పదవితో సరిపెట్టుకుంటారా వేచి చూడాల్సి ఉంది.