Home Page SliderTelangana

“ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సుతో పని”.. ఈ సదస్సు ముఖ్యోద్దేశం ఇదే..

“Making AI work for every one” ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సు తో పని ” అనే ఇతివృత్తంతో రేపటి నుండి రెండు రోజుల పాటు  హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో సదస్సు జరగనుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు.. సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సు లో పాల్గొంటున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈసదస్సు కు హాజరుకానున్నారు. కొత్త సాంకేతికత పరిజ్ఞానం తో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు.

హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్,  ఇంటరాక్టివ్ సెషన్‌ లు ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో నిర్మించనున్న ఫోర్త్ సిటీ లో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా AI సిటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని AI హబ్ గా తీర్చిదిద్దేందుకు.. ప్రపంచ దిగ్గజ సంస్థల  పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. AI గ్లోబల్ సదస్సులో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్ ను విడుదల చేస్తారు.