మహిళలే మహారాణులు: సీతక్క
తెలంగాణలో మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. “గతంలో డబ్బుల కోసం మహిళలు మగవారిపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. మహిళలకు కుట్టుమిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించాం. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. ఉచిత బస్సు సౌకర్యం అందిస్తుంటే. బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు ఈ పథకాన్ని అగౌరవపరుస్తూ మహిళలపై విమర్శలు చేస్తున్నారు” అని సీతక్క పేర్కొన్నారు.

