ఎమ్మెల్యే ఇంట్లోకి బర్రెలను తోలిన మహిళ
భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ దగ్గర ఓ రైతు కుటుంబం చేపట్టిన నిరసన చర్చనీయాంశంగా మారింది. వేశాలపల్లి గ్రామానికి చెందిన లలిత అనే మహిళ తన బర్రెలను తోలుకుని నేరుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. ఇందుకు కారణం ఏమిటంటే, ఆమె భర్తతో కలిసి తమ భూమిపై నిర్మించుకున్న పశు షెడ్డును అధికారులు కూల్చివేశారని, దీనికి ఎమ్మెల్యేనే బాధ్యుడని ఆమె ఆరోపించారు. “ఎవరిని అడిగినా ఎమ్మెల్యే సారే షెడ్ కూల్పించారాని చెబుతున్నారు… షెడ్డయ్యే దాకా మేము ఊరుకోము… న్యాయం జరిగే వరకు ఇదే ఇంట్లో ఉంటాను,” అంటూ ఆమె అధికారుల పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమకు ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మౌనం వహిస్తున్న ఎమ్మెల్యే న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసారు. మహిళ చేస్తున్న నిరసన, బర్రెలతో ఆఫీస్‌లోకి ప్రవేశించడం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయానికి మార్గం లేకపోతే ఎలా తిరుగుబాటు చేస్తారన్నదానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా మారింది. అధికారుల అరాచకాన్ని ఎదుర్కొనడంలో ఒక గ్రామీణ మహిళ ధైర్యంగా నిలబడిన తీరు ప్రజలతోపాటు రాజకీయ వర్గాలను కూడా ఆలోచనలో పడవేసింది. పాలకులు ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.