నంబర్ ప్లేట్ లేకపోతే జైలుపాలే
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా ఝళిపిస్తోంది కమాండ్ అండ్ కంట్రోల్ విభాగం. సాధారణంగా ట్రాఫిక్ ఆంక్షలు పాటించని వారిపై సీసీ కెమెరాల ద్వారా చలాన్లు విధిస్తుంటారు. లేదా క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు వారి చేతుల్లోని డిజిటల్ కెమెరాలతో నంబర్ ప్లేట్ కనిపించేలా ఫొటోలు తీసి, చలాన్లు వడ్డిస్తుంటారు. ఈ- చలాన్ల నుండి తప్పించుకోవడానికి కొందరు రకరకాల ట్రిక్స్ పాటిస్తున్నారు. ట్రాఫిక్ కెమెరాలకు నంబర్ ప్లేట్ కనిపించకుండా కవర్ చేయడం, నంబర్ ప్లేట్లు మూసివేయడం, వాటిని విరిచేయడం, వంచేయడం, పూర్తిగా తీసివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

పైగా చైన్ స్నాచర్లు, ఇతర నేరగాళ్లు కూడా ఇలాగే చేయడంతో అధికారులు కఠినంగా వ్యవహరించదలచుకున్నారు. ఈమధ్య నంబర్ ప్లేటును ఉద్దేశపూర్వకంగా మూసివేసిన వారిపై పగడ్బందీగా కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రెయిన్ బజార్‌లో పోలీసులు నంబర్ ప్లేట్ మూసివేసిన యువకునిపై కేసు నమోదు చేసారు. న్యాయస్థానం కూడా సీరియస్‌గా తీసుకుని 8 రోజుల జైలుశిక్ష విధించింది. ఇంత శిక్ష వేయడం ఈ తరహా కేసులలో ఇదే మొదటిసారి. ఎక్కువగా ద్విచక్రవాహనదారులే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా వెనుకవైపు నంబరు ప్లేటునే నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఈ నెల మొదటి వారం అంతా ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వీటిలో నంబర్ ప్లేటు స్పష్టంగా లేకపోవడం, కవర్ చేయడం, అసలు నంబరు ప్లేటే లేకపోవడం, హెల్మెట్ లేకపోవడం, వంటి చర్యలకు పాల్పడిన దాదాపు 3 వేల మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

