Andhra PradeshNews

వాలంటీర్లు చేతుల్లో గెలుపోటములు

Share with

వాలంటీర్లకు టికెట్లు ఇచ్చేసే రేంజ్‌లో ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఎదురవుతున్న సంఘటనలు తలుచుకుని.. నాయకులు తల్లడిల్లుతున్నారు. వాలంటీర్లకు టికెట్లు ఇచ్చేసే రేంజ్‌లో ప్రజల మైండ్ సెట్ మారిపోతోందని నాయకులు భావిస్తున్నారు. మరి దీనికి కారణం.. ఏమిటి? ఎందుకు? అంటే.. గడిచిన మూడేళ్లుగా ప్రజలకు.. నాయకులకు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవడమేనని అంతిమంగా తేలిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం నాయకులు.. గడపగడప కార్యక్రమం కింద.. ప్రజలను కలుస్తున్నారు. ఇష్టం ఉన్నా.. లేకున్నా.. జగన్.. చెప్పారు కాబట్టి.. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. వారితో మాటలు కలుపుతున్నారు. అయితే.. ఈ మాటల సందర్భంలో నాయకులను ప్రజలు తికమక పెడుతున్నారు. అమ్మా.. మీకు సంక్షేమ పథకాలు.. అందుతున్నాయి కదా! అని మంత్రి నారాయణ స్వామి తాజాగా.. తన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో ప్రజలను ప్రశ్నించారు. దీనికి అందుతున్నాయని.. వారి నుంచి ముక్తకంఠంతో సమాధానం వచ్చింది. అయితే.. మీకు ఇవన్నీ ఎవరిస్తున్నారు? అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. దీనికి ప్రజల నుంచి వచ్చిన సమాధానం.. ఇంకెవరు.. వాలంటీరే అని చెప్పారు.


దీంతో మంత్రి మరోసారి ఆమెను మన పార్టీ గుర్తు ఏంటమ్మా అని అడుగగా ఆమె సైకిల్ అంటూ సమాధానం ఇవ్వడంతో మంత్రికి దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆయన వెంటనే వాలంటీర్‌ను తొలగించాలని ఆదేశించారు. వాస్తవానికి వీటిని అందిస్తున్నది వైసీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి జగన్.. ఇక లబ్ధిదారులను సూచిస్తున్నది మాత్రం ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్రజలు మరిచిపోయారు. కేవలం నిత్యం తమ ఇంటికి తిరిగే వాలంటీర్లనే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దీంతో తమకు రావాల్సిన గుర్తింపు.. కాస్తా.. వాలంటిర్లు కొట్టేస్తున్నారనేది ఎమ్మెల్యేల ఆవేదనగా ఉంది. ఇదే గతంలో జగన్ కూడా చెప్పారు. మీరు ప్రజలకు చేరువ అవండి.. ప్రజల మధ్య ఉండండి.. లేకపోతే.. మిమ్మల్ని మరిచిపోయే పరిస్థితి వస్తుంది.. జాగ్రత్త! అని ఆయన హెచ్చరించారు. కానీ ఎవరూ అప్పట్లో లెక్కచేయలేదు. ఇప్పుడు అనుభవవంలోకి వచ్చేసరికి.. రేపు వాలంటీర్‌ను నిలబెట్టినా గెలిచిపోయే రేంజ్‌లో వారి హవా నడుస్తోందని కొందరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రజలతో ఉంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.