వర్మ కోసం ఆమెను వదులుకుంటారా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం విషయంలో వైసీపీ ఆలోచన ఏమిటి..? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత అక్కడ పెద్దగా కనిపించడం లేదనే వార్త పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో వైసీపీ తరఫున పెండ్యం దొరబాబు గెలిచారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన జనసేనలో చేరిపోయారు. దీంతో అక్కడ జనసేన బలమైన శక్తిగా ఎదిగింది. దీంతో వంగా గీత పార్టీ కార్యక్రమాలను తూతూ మంత్రంగానే సాగిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆమె వెనక్కి తగ్గినట్లు ప్రచారం కూడా నడుస్తోంది. వంగా గీతాకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ సమయంలో మెగాస్టార్ కుటుంబంతో ఆమెకు మంచి సంబంధాలే నడిచాయి. వంగా గీత విషయంలో మెగా ఫ్యామిలీ కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. వైసిపి ప్రభుత్వంలో కాకినాడ ఎంపీగా పనిచేసిన గీత, పవన్ కళ్యాణ్ పై ఎవరూ ఊహించని పరిస్థితిలో ఆయనపై పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వంగా గీతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థి మంచి మహిళ అని.. ఎప్పటికైనా ఆమె జనసేనలో చేరడం ఖాయమని తేల్చి చెప్పారు. కానీ వంగా గీత పెద్దగా స్పందించలేదు. తాజాగా రాష్ట్రస్థాయిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు జరపాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా అలాంటి కార్యక్రమాలు జరగలేదు. కొన్నిసార్లు ఆమె నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వంద మందికి మించి వైసిపి కార్యకర్తలు హాజరు కాలేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు గీత భవిష్యత్తు విషయంలో ఒక ఆలోచనకు వచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. వర్మ వైసీపీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో వర్మ వైసీపీలోకి వస్తే తన పరిస్థితి ఏమిటనే విషయంలో గీత పునరాలోచనలో పడిందట. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఉన్నా.. లేనట్టేనని ఆ పార్టీ వర్గాలే చెబుతుండడం మరో విశేషం. ప్రస్తుతం అక్కడ జనసేన బలంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు కొనసాగిన పెండ్యం దొరబాబు తన అనుచరులు, క్యాడర్ తో జనసేనలోకి వచ్చారు. అయితే వైసిపి ఎక్కువగా వర్మపై ఫోకస్ చేయడంతో గీత భవిష్యత్తుపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే మెగా ఫ్యామిలీతో ఆమెకు ఉన్న అనుబంధం దృష్ట్యా జనసేనలోకి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది.

